ప్రేమించి పెళ్లిచేసుకొని చనిపోయిన పంతం వీడని తల్లిదండ్రులు..

     Written by : smtv Desk | Sun, Aug 21, 2022, 07:46 PM

ప్రేమించి పెళ్లిచేసుకొని చనిపోయిన పంతం వీడని తల్లిదండ్రులు..

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.. పేదరికంలోనూ ఆ దంపతులు సంతోషంగా ఉన్నారు. అన్యోన్యతకు గుర్తుగా మరో ప్రాణి తమ మధ్యకు రాబోతోందని మురిసిపోయారు. అంతలోనే విధి చిన్నచూపు చూసింది.. పాపకు జన్మనివ్వగానే పురిట్లోనే ఆ తల్లి కన్నుమూసింది. భార్య మరణం తట్టుకోలేని భర్త రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. పసిగుడ్డు ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై కొట్టుమిట్టాడుతోంది.. కన్నీరుపెట్టించే ఈ విషాదానికి గాంధీ ఆసుపత్రి సాక్షిగా నిలిచింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
నారాయణపేట జిల్లా మక్తల్‌కు చెందిన ఉప్పరి ఆంజనేయులు కుమారుడు నవీన్‌కుమార్‌ (28), భీమేశ్వరి(26) ప్రేమించుకున్నారు. వేర్వేరు కులాలు.. ఆర్థిక అసమానతలతో పెద్దలు పెళ్లికి నిరాకరించారు. రెండేళ్లక్రితం ఇద్దరూ పెళ్లి చేసుకోగా వారిని పెద్దలు విడదీశారు. ఒకరినొదిలి మరొకరం ఉండలేమంటూ గతేడాది వారిద్దరూ నగరానికి చేరారు. మౌలాలిలో ఉంటున్నారు. నవీన్‌కుమార్‌ ఆటో నడుపుతూ కొద్దిపాటి సంపాదనతోనే అన్యోన్యంగా ఉంటున్నారు. తాము తల్లిదండ్రులం కాబోతున్నామనే విషయం తెలియగానే పొంగిపోయారు. రెండు కుటుంబాల్లోనూ ఈ విషయం తెలిసినా ఏ ఒక్కరూ కన్నెత్తి చూడలేదు. ఈనెల 18న భీమేశ్వరికి పురిటినొప్పులు మొదలయ్యాయి. పక్కింటి మహిళ సాయంతో నేరేడ్‌మెట్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అదేరోజు రాత్రి ఆమె పాపకు జన్మనిచ్చింది. కాన్పు అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. పసికందు తీవ్ర అనారోగ్యంతో ఉండటంతో ఇద్దరినీ గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి భీమేశ్వరి మరణించింది. మార్చురీలో భార్య మృతదేహం.. చావుబతుకుల మధ్య కన్నబిడ్డ. ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో నవీన్‌కుమార్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గాంధీ ఆసుపత్రి నుంచి సంజీవయ్య పార్క్‌ వద్దకు చేరి.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం రాత్రి రైలు పట్టాలపై గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్టు ఆర్పీఎఫ్‌ హోంగార్డు జీఆర్పీ పోలీసులకు సమాచారమిచ్చారు. మృతుడి జేబులో లభ్యమైన సెల్‌ఫోన్‌ ఆధారంగా వారు మృతుడి కుటుంబసభ్యులకు తెలిపారు. భార్యాభర్తల మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం శనివారం మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు.
మరణించాకా విడదీశారు : ప్రేమించి పెళ్లిచేసుకొని.. పేదరికంలోనూ ఆనందంగా గడిపిన దంపతులను మరణం కూడా విడదీయలేకపోయింది. కానీ బిడ్డల ప్రేమను అంగీకరించలేని పెద్దలు వారి మరణం తర్వాతా తమ పంతం నెరవేర్చుకున్నారు. వెంటిలేటర్‌పై ఉన్న పసికందును సాదే ఆర్థిక స్తోమత తమకు లేదంటూ ఒకరు.. బిడ్డే దూరమైనపుడు ఆ పాప తమకెందుకంటూ మరొకరు చెరోదారిన వెళ్లిపోయారు. నవీన్‌కుమార్‌, భీమేశ్వరిల మృతదేహాలను విడివిడిగా తీసుకెళ్లారు. పసికందు ఆరోగ్యం కుదుటపడ్డాక శిశువిహార్‌కు తరలిస్తామని పోలీసులు తెలిపారు. భీమేశ్వరి అంత్యక్రియలు మక్తల్‌లో జరగ్గా, నవీన్‌కుమార్‌కు హైదరాబాద్‌లోనే నిర్వహించినట్లు తెలిసింది.





Untitled Document
Advertisements