ఇండోనేసియా ఫుట్‌బాల్ స్టేడియంలో బారి ప్రాణ నష్టం

     Written by : smtv Desk | Sun, Oct 02, 2022, 10:21 AM

ఇండోనేసియా ఫుట్‌బాల్ స్టేడియంలో బారి ప్రాణ నష్టం

ఫుట్‌బాల్ మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన తొక్కిసలాటలో 127 మంది ప్రాణాలు కోల్పోగా 180 మంది గాయపడ్డారు. లీగ్ మ్యాచ్‌లో స్థానిక జట్టు ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన అభిమానులు పిచ్ మధ్యలోకి పరిగెత్తారు. దీంతో వారిని అదుపు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగి టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఊపిరి ఆడకపోవడంతో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించింది. ఈ విషాదం ఇండోనేసియాలో చోటు చేసుకుంది.
ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తొక్కిసలాట కారణంగా 127 మంది మరణించగా 180 మంది గాయపడ్డారు. ఈ ఘటన ఇండోనేసియాలోని ఈస్ట్ జావా ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. ఇండోనేసియాలోని టాప్ లీగ్‌‌గా గుర్తింపు పొందిన బ్రి లిగా 1లో భాగంగా శనివారం రాత్రి మలాంగ్ స్టేడియంలో స్థానిక అరేమా ఎఫ్‌సీ, పెర్సేబయా సురబయా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పెర్సేబయా జట్టు 3-2 తేడాతో విజయం సాధించింది. మలాంగ్‌లోని స్టేడియానికి హాజరైన ప్రేక్షకులు పిచ్ మధ్యలోకి పరిగెత్తుతున్న దృశ్యాలను స్థానిక మీడియా ఛానెళ్లు ప్రసారం చేశాయి. సోషల్ మీడియాలోనూ ఈ వీడియో వైరల్ అయ్యింది. ఈ దుర్ఘటన నేపథ్యంలో బ్రి లిగా 1 లీగ్‌ను వారంపాటు వాయిదా వేశారు. ఈ ఘటనపై విచారణను ప్రారంభించినట్లు ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండోనేసియా ప్రకటించింది. ఈ మ్యాచ్‌ను వీక్షించడానికి 40 వేల మంది ప్రేక్షకులు స్టేడియానికి హాజరయ్యారని తెలుస్తోంది. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో ఆగ్రహానికి లోనైన అభిమానులు స్టేడియం బయట పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు, కొన్నింటికి నిప్పు అంటించారు. వివిధ క్లబ్‌లకు చెందిన అభిమానుల మధ్య ఘర్షణల కారణంగా ఇండోనేసియాలో గతంలోనూ ఫుట్‌బాల్ మ్యాచ్‌ల నిర్వహణకు ఇబ్బందులు కలిగిన సందర్భాలున్నాయి.





Untitled Document
Advertisements