జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి దరఖాస్తుల గడువు పొడగింపు

     Written by : smtv Desk | Sun, Oct 02, 2022, 03:18 PM

జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి దరఖాస్తుల గడువు పొడగింపు

జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన వివరాలు వెల్లడించారు. పేద విద్యార్థులు విదేశాలకు వెళ్లి ప్రఖ్యాత యూనివర్సిటీల్లో చదువుకోవాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, వికలాంగులు, భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇందుకోసం గత నెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. ఇప్పటి వరకు 392 దరఖాస్తులు వచ్చాయని, అయితే ఈ పథకంలో ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం మరో నెల రోజుల పాటు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్యూఎస్ 1 నుంచి 200 ర్యాంకులతో యూనివర్సిటీల్లో సీట్లు పొందిన విద్యార్థులకు ఇది వర్తిస్తుందని తెలిపారు. క్యూఎస్ ర్యాంకు ఒకటి నుంచి వంద వరకు ఉన్న యూనివర్సిటీల్లో సీట్లు పొందిన విద్యార్థులకు ఫీజు చెల్లించినా 100 శాతం రీయింబర్స్ మెంట్ వచ్చేలా పథకాన్ని రూపొందించినట్లు వివరించారు. వార్షికాదాయం రూ.8 లక్షల లోపు ఉన్న వారు ఈ పథకానికి అర్హులని తెలిపారు. ఈ పథకంలోని నిబంధనల ప్రకారం అర్హులైన వారందరికీ ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ ఇస్తుందని హర్షవర్ధన్ వివరించారు.





Untitled Document
Advertisements