ఉత్తరకొరియా ధోరణిలో మార్పులొస్తున్నాయి: జిన్ పింగ్

     Written by : smtv Desk | Wed, Jan 17, 2018, 02:48 PM

ఉత్తరకొరియా ధోరణిలో మార్పులొస్తున్నాయి:  జిన్ పింగ్

బీజింగ్, జనవరి 17: వరుస క్షిపణి ప్రయోగాలతో ప్రపంచదేశాలను వణికిస్తున్న ఉత్తరకొరియాలో ఇప్పుడిప్పుడే సానుకూల మార్పులొస్తున్నాయని చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ జిన్‌పింగ్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్లు చైనా మీడియా పేర్కొంది. 'ఉత్తరకొరియాలో సానుకూల మార్పులొస్తున్నాయి. అన్ని వైపుల నుంచి బృందాలు ఉమ్మడిగా ప్రయత్నం చేస్తే.. ఆ దేశంతో చర్చలు జరిపేందుకు సులభతరం అవుతుంది' అని జిన్‌పింగ్‌ ఫోన్‌లో ట్రంప్‌కు చెప్పినట్లు చైనా మీడియా వెల్లడించింది.

ఉత్తరకొరియాతో ద్వైపాక్షికంగా సంబంధాలు తెంచుకునే విషయంపై వాంకోవర్‌లో చర్చలు జరిపేందుకు 20దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవడానికి ముందు జిన్‌పింగ్‌ ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అమెరికా, కెనడా సంయుక్త అధ్యక్షతన రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో చైనా, రష్యా దేశాలు పాల్గొనడం లేదు. క్షిపణి దాడులతో కయ్యానికి కాలుదువ్వుతున్న ఉత్తరకొరియాను నియంత్రించడంలో భాగంగానే యూఎస్‌-కెనడా ఈ సమావేశం నిర్వహిస్తోంది. ఐక్యరాజ్యసమితి కూడా ఉ.కొరియాపై పలు ఆంక్షలను విధించిన సంగతి తెలిసిందే.

Untitled Document
Advertisements