ఒకటిగా జీవించలేక..

     Written by : smtv Desk | Fri, Feb 02, 2018, 11:48 AM

ఒకటిగా జీవించలేక..

వజ్రపుకొత్తూరు, ఫిబ్రవరి 2 : సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు ప్రతి ఒక్కరిని కలచివేస్తున్నాయి. ముఖ్యంగా ప్రేమికులు తమ ప్రేమను గెలిపించుకోలేక తనువులు చాలిస్తున్నారు. ధైర్యంగా ప్రేమించిన విషయాన్ని పెద్దలకు చెప్పలేక ఇష్టం లేకపోయిన వేరే వారిని వివాహం చేసుకుంటున్నారు. తర్వాత కట్టుకున్నవారితో జీవితం గడపలేక ఆసువులు బాస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన వజ్రపుకొత్తూరు మండలం బెండిగేటు సమీపంలో గురువారం చోటు చేసుకుంది.

బాధిత కుటుంబీకులు, పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని తండేవలస గ్రామానికి చెందిన అమలాపురం అప్పలరాజు (24), బుడుమూరు పద్మ (18) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అప్పలరాజు స్థానికంగా ఇటుకల బట్టీలో కూలీగా పనిచేస్తున్నారు. ఆయనకు రెండేళ్ల క్రితమే తన అక్క కూతురు లావణ్యతో వివాహం జరిగింది. వీరికి 6 నెలల కొడుకు ఉన్నట్లు సమాచారం. పద్మ నగరంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఆమెకు తండ్రి లేనప్పటికీ తల్లి సీతమ్మ, అన్నయ్య సతీష్‌ కూలీ పని చేసుకుంటూ పద్మను చదివిస్తున్నారు.

గురువారం ఉదయం కళాశాలకు బయలుదేరిన పద్మ, అప్పలరాజును నగరంలో కలుసుకుంది. అక్కడ నుంచి నేరుగా పూండి చేరుకుని బెండిగేటు సమీపంలో జీడి తోట వద్దకు వెళ్లారు. జీవితంలో కలిసి బతకలేమని నిర్ణయం తీసుకున్న వీరు.. క్షణికావేశంలో పూండి రైల్వేస్టేషన్‌ సమీపంలో విశాఖ వైపు వెళుతున్న ఈఎంయూ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. వివాహం ముందు నుంచి అప్పలరాజు, పద్మల మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్లు సమాచారం.


అప్పలరాజు మృతితో భార్య లావణ్య, ఆరు నెలల కుమారుడికి దిక్కెవరంటూ పలువురు వాపోయారు. ప్రస్తుతం వీరు సొంత గ్రామం తండేవలసలో ఉంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి పలాస ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాలను తరలించినట్లు జీఆర్‌పీ ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు. శుక్రవారం శవపంచనామా నిర్వహిస్తామని వెల్లడించారు.

Untitled Document
Advertisements