పెరిగిన వంటనూనే ధరలు.. గగ్గోలు పెడుతున్న ప్రజలు

     Written by : smtv Desk | Mon, Feb 27, 2023, 01:54 PM

పెరిగిన వంటనూనే ధరలు.. గగ్గోలు పెడుతున్న ప్రజలు

నిత్యవసరాల ధరలు నానాటికి పెరుగిపోతుండడంతో సామాన్యుడి బ్రతుకు భారంగా మారుతుంది. ఇప్పటికే పాలు మొదలుకొని కూరగాయలు, వంటనూనేలు వంటి వాటి ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయంటూ గగ్గోలు పెడుతుంది. మరో పక్క వంట నూనేల ధరలకు మరోసారి రెక్కలోచ్చాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే రూ.15 నుంచి రూ.20 వరకు ధరలు పెరగడంతో సామాన్యులలో ఆందోళన వ్యక్తమవుతోంది. వేరుశనగ నూనె ధర లీటరుకు రూ.20 దాకా పెరిగి ఫిబ్రవరి 26నాటికి లీటరుకు రూ.180లకు చేరుకుంది. ఇక పామాయిల్ ధర రూ.3 నుంచి రూ.5 వరకు పెరిగి ప్రస్తుతం లీటర్ ధర రూ.104 కు చేరింది. సన్ ఫ్లవర్ నూనె ధరలో మాత్రం మార్పులేదు. లీటరుకు రూ.135ల వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

దేశంలో నూనె గింజల పంటల ఉత్పత్తి తగ్గడం, విదేశాల్లో వేరుశనగ నూనెకు డిమాండ్‌ పెరగడం వల్ల ధరలు పెరుగుతున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. చైనాలో వేరుశనగ నూనెకు డిమాండ్ ఎక్కువ. వేరుశనగ దిగుమతులకు డ్రాగన్ కంట్రీ మన దేశంపైనే ఆధారపడుతోంది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధం నేపథ్యంలో మన దేశం నుంచి దిగుమతులను పెంచేసింది. మరోవైపు, ఈసారి దేశవ్యాప్తంగా వేరుశనగ దిగుబడి 1.4 లక్షల టన్నులు వస్తుందని ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు.

అయితే, ఈ నెల 14న విడుదల చేసిన ముందస్తు అంచనాలో వేరుశనగ దిగుబడి 100 లక్షల టన్నులుగా ఉంటుందని తెలిపారు. మొత్తం 9 రకాల నూనె గింజల పంటలు కలిపి దేశంలో 423 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించగా.. తాజా అంచనాలలో ఇది 400 లక్షల టన్నులు మాత్రమే ఉంటుందని తేల్చారు. వేరుశనగ సాగులో దేశంలోనే ముందున్న గుజరాత్ లో ఈసారి దిగుబడి తగ్గనున్నట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
గుజరాత్ తర్వాతి స్థానాల్లో ఉండే రాజస్థాన్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లలో కూడా ఈసారి వేరుశనగ దిగుబడి తగ్గనుందని అంచనా. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో క్వింటాల్ వేరుశనగ రూ.7,400 నుంచి రూ.8,400 దాకా ధర పలుకుతోంది. మరోవైపు, ఇండోనేసియాలో ఎగుమతులపై ఆంక్షల కారణంగా సన్ ఫ్లవర్ గింజల దిగుమతులు తగ్గాయని అధికారులు తెలిపారు. దీంతో మన దేశంలో వంట నూనెల ధరలు మళ్లీ పెరుగుతున్నాయని వివరించారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే సామాన్యుల బ్రతుకులు మరింత భారంగా మారే అవకాశాలు ఉన్నాయి.





Untitled Document
Advertisements