కోహ్లీ సెంచరీలపై పాక్ క్రికెటర్ స్పందన ?

     Written by : smtv Desk | Thu, Mar 16, 2023, 04:56 PM

కోహ్లీ సెంచరీలపై పాక్ క్రికెటర్ స్పందన ?

ఆస్ట్రేలియాతో చివరి టెస్టులో భారీ సెంచరీతో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. టెస్టుల్లో 1,205 రోజుల త‌ర్వాత మూడంకెల స్కోరును నమోదు చేశాడు. ఆ సెంచ‌రీతో అంత‌ర్జాతీయ క్రికెట్ లో కోహ్లీ సెంచ‌రీల సంఖ్య 75కు పెరిగింది. అత్య‌ధిక సెంచ‌రీలు సాధించిన బ్యాట‌ర్ల‌లో స‌చిన్ త‌ర్వాత రెండో స్థానంలో కోహ్లీ ఉన్నాడు.

ఈ నేపథ్యంలో కోహ్లీ ఇకపై సెంచ‌రీల మోత మోగిస్తాడ‌ని పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్ షోయబ్ అక్త‌ర్ చెప్పాడు. ఏఎన్ఐ వార్తా సంస్థతో అతడు మాట్లాడుతూ.. కోహ్లీ ఓ బీస్ట్‌లా ప‌రుగుల ప్ర‌వాహాన్ని సృష్టిస్తాడ‌ని, క‌చ్చితంగా వంద సెంచ‌రీల మార్క్‌ను దాటుకుంటాడని జోస్యం చెప్పాడు. కోహ్లీ మొత్తం 110 సెంచ‌రీలు కొట్ట‌గ‌ల‌డ‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌ని అన్నాడు. కోహ్లీ ఫామ్‌లోకి రావ‌డంలో త‌న‌కు ఆశ్చ‌ర్యం ఏమీ కలగలేదని అక్తర్ చెప్పాడు. కెప్టెన్సీ ఒత్తిడి తగ్గడంతో కోహ్లీ ఫ్రీగా ఉన్నాడ‌ని, ఇప్పుడు ఎంతో ఫోక‌స్‌తో ఇన్నింగ్స్ ఆడతాడ‌ని అంచనా వేశాడు.

త‌న కెరియర్ లో స‌చిన్ టెండూల్క‌ర్‌ వికెట్ ను ఫేవ‌రేట్ గా భావించేవాడిన‌ని అక్తర్ తెలిపాడు. ఓ సారి కోల్‌క‌తాలో మ్యాచ్ ఆడుతున్న‌ప్పుడు జ‌రిగిన విష‌యాన్ని అత‌ను చెప్పుకొచ్చాడు. స‌చిన్ వికెట్ తీసుకుంటాన‌ని ఓ సారి తన జట్టు సభ్యులకు చెప్పిన‌ట్లు గుర్తు చేశాడు. ఆ మ్యాచ్‌లో తొలి బంతికే స‌చిన్ వికెట్ తీసిన‌ట్లు అత‌ను చెప్పాడు. ల‌క్ష మంది ప్రేక్ష‌కుల మ‌ధ్య స‌చిన్ వికెట్ తీయ‌డం సంతోషాన్ని కలిగించిందని, స‌చిన్ ఔట‌య్యాక స‌గం స్టేడియం ఖాళీ అయిపోయిందని నాటి సంగతులను గుర్తుచేసుకున్నాడు.





Untitled Document
Advertisements