క్రాస్ ఓటింగ్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు వారేనా?

     Written by : smtv Desk | Fri, Mar 24, 2023, 12:02 PM

క్రాస్ ఓటింగ్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు వారేనా?

నిన్న జరిగిన ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో చోటు చేసుకున్న కీలక పరిణామాలు అధికార వైసీపీని ఉలిక్కిపడేలా చేసాయి. అంతేకాకుండా నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నలుగురిలో ఇద్దరు రెబెల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డిలు టీడీపీకి ఓటు వేయవచ్చనేది ముందు నుంచి అందరూ భావించిందే. అయితే మరో ఇద్దరు ఎవరనే విషయం ఆసక్తికరంగా మారింది. మిగిలిన ఇద్దరూ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి అయి ఉండొచ్చని నిన్నటి నుంచే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. మరోవైపు వీరిద్దరూ ఈనాటి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. దీంతో వీరిపై అనుమానాలు మరింత పెరుగుతున్నాయి.

ఓటు హక్కును వినియోగించుకున్న వెంటనే మేకపాటి బెంగళూరుకు వెళ్లిపోయారు. ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. ఇంకోవైపు క్రాస్ ఓటింగ్ అంశంలో తన పేరు రావడంపై ఉండవల్లి శ్రీదేవి స్పందిస్తూ.. క్రాస్ ఓటింగ్ చేయాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. పార్టీ ఇచ్చిన కోడ్ ప్రకారమే తాను ఓటు వేశానని అన్నారు. దళిత మహిళను కాబట్టే తనను చులకనగా చూస్తున్నారని చెప్పారు. స్క్రూటినీ చేసి క్రాస్ ఓటింగ్ చేసిన వారిని గుర్తించాలని అన్నారు. ఓటు వేసింది ఎవరు అనే విషయాన్ని పక్కన పెడితే సొంత పార్టీలోనే తమకు శత్రువులు ఉన్నారు అనేది నిజం అనేది అధికార వైసీపీకి అర్ధం అయిపొయింది.





Untitled Document
Advertisements