భానుడి సెగలు .. పెరిగిన ఉష్ణోగ్రతలు

     Written by : smtv Desk | Wed, Apr 19, 2023, 02:52 PM

భానుడి సెగలు .. పెరిగిన ఉష్ణోగ్రతలు

దేశవ్యాప్తంగా భానుడు సెగలు కక్కుతున్నాడు. దేశంలోని చాలా ప్రాంతాల్లో నిన్న ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో అయితే చెప్పడానికి లేదు. వరుసగా మూడో రోజు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణం కంటే దాదాపు 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి.

అయితే, భారత వాతావరణశాఖ (ఐఎండీ) మాత్రం ఊరటనిచ్చే ప్రకటన చేసింది. పశ్చిమ హిమాలయ ప్రాంతంలో వెస్టర్న్ డిస్ట్రబెన్స్ యాక్టివ్ కావడంతో వాయవ్య భారతదేశంలో ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం లభిస్తుందని పేర్కొంది. పంజాబ్, హర్యానా, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లపై దట్టమైన మేఘాల కదలికలు కనిపిస్తుండడంతో వచ్చే మూడు నాలుగు రోజుల్లో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

షేక్‌పూర్‌లో 44.4 డిగ్రీలు
అయితే, దేశంలోని మిగతా ప్రాంతాల్లో మాత్రం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ పేర్కొంది. చాలా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు సమీపంలో ఉన్నట్టు వివరించింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్, హమీర్పూర్‌లలో 44.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో 43.2 డిగ్రీలు, కోటాలో 42.8 డిగ్రీలు, బన్సవారాలో 42.7, అల్వార్‌లో 41.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బీహార్‌ రాజధాని పాట్నాలో 44.1 డిగ్రీలు, షేక్‌పూర్‌లో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంతేకాదు, వచ్చే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.





Untitled Document
Advertisements