కదంతొక్కిన కోహ్లి.. 5-1తో సిరీస్ భారత్ వశం

     Written by : smtv Desk | Sat, Feb 17, 2018, 10:55 AM

కదంతొక్కిన కోహ్లి.. 5-1తో సిరీస్ భారత్ వశం

సెంచూరియన్, ఫిబ్రవరి 17 : పరుగులు వీరుడు మరోసారి రెచ్చిపోయాడు. తనదైన శైలిలో అందమైన షాట్లతో అలరించిన సారథి విరాట్ (129) కెరీర్ లో 35వ శతకంను నమోదు చేసుకున్నాడు. ఫలితంగా ఆరు వన్డేల సిరీస్ ను కోహ్లి సేన 5-1తో గెలిచి ఆతిధ్య జట్టుకు అందనంత ఎత్తులో నిలిచింది. ఎన్నో రికార్డులను తన పాదాక్రాంతం చేసుకున్న విరాట్ మరో రికార్డు ను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే చరిత్రలోనే ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో 500కు పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా కోహ్లి రికార్డు సృష్టించాడు.

తొలుత టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న భారత్ కు మంచి శుభారంభం లభించింది. భారత్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ స్థానంలో వచ్చిన పేసర్ శార్దుల్ ఠాకూర్ (4/52) రాణించగా, బుమ్రా, చాహల్, చెరో రెండు వికెట్లు, పాండ్యా, కులదీప్ యాదవ్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఫలితంగా సఫారీల జట్టు 46.5 ఓవర్లలో 204 పరుగులకే ఆలౌటైంది.

అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన టీమిండియా గత మ్యాచ్ లో సెంచరీ చేసిన రోహిత్ శర్మ(15) ఎంగిడి బౌలింగ్ లో కీపర్ క్యాచ్ గా వెనుదిరగాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ కోహ్లి స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపించాడు. ఈ క్రమంలో శిఖర్ ధావన్(18) అవుట్ కాగా, అనంతరం క్రీజులోకి వచ్చిన రహనే(34 నాటౌట్) విరాట్ కు సహకారం అందించాడు. దీంతో టీమిండియా 32.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 206 పరుగుల చేసి ఘన విజయం సాధించింది. అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న కోహ్లి ‘మ్యాన్ అఫ్ ది మ్యాచ్’, ‘మ్యాన్ అఫ్ ది సిరీస్’ ను దక్కించుకున్నాడు.





Untitled Document
Advertisements