నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం..

     Written by : smtv Desk | Wed, Feb 21, 2018, 01:25 PM

నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం..

హైదరాబాద్, ఫిబ్రవరి 21 : భాష.. మనం మాట్లాడే పదాల కలయిక.. భావాలను తెలపడానికి, ఎదుటివారికి మన మదిలో మాటలు చెప్పడానికి ఉపయోగపడే సాధనం. కాగా నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. అన్ని భాషల్లో తెలుగు భాష స్థానం ప్రత్యేకం. మన మాతృభాష, అచ్చమైన, స్వచ్చమైన పదాల మిళితం.. అందమైన సరస్సులో విరబూసిన తామర పువ్వుల సోయగం.. తెలుగు కవుల హృదయాల నుండి జారువాలిన మన భాషను వర్ణించడం ఎవరి తరం కాదు.. అలాంటి మన దేశంలో ప్రస్తుతం తెలుగు కనుమరుగు అయ్యే పరిస్థితి వచ్చింది. ఎంతో కాలంగా మనల్ని పరిపాలించిన బ్రిటిష్ వారు వారి ఆంగ్ల భాషను మనమీద రుద్దిపోయారు.

అభివృద్ధి అనే పేరుతో ఆంగ్లం మోజులో అమ్మ భాషను విస్మరిస్తున్న మన సమాజం ఒక్కసారి ఆలోచించాలి. ప్రపంచంలో మొత్తం 6000 భాషలు ఉన్నాయి. అందులో చాలా భాషలు కనుమరుగయ్యే స్థితికి వచ్చాయి. 1952 ఫిబ్రవరి 21 న బెంగాలీ భాష ఉద్యమ అల్లర్లలో నలుగురు యువకులు మృతి చెందడంతో ఆ రోజుకు గుర్తుగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 'అ' అక్షరం తో మొదలయ్యే తెలుగు లో అమ్మదనం, కమ్మదనం కలిపిన పదాల సమ్మేళనం మరుపులేని జ్ఞాపకం. అలాంటి తెలుగు మాట్లాడాలంటే చాలా మంది అవమానంగా భావిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక తమ మాతృభాషా కోసం ఎంతో పరితపిస్తుంటే మనం మాత్రం వెగటుగా చూడటం భాదాకరమైన విషయం.

బ్రతకడం కోసం పరభాషను నేర్చుకోవడంలో తప్పులేదు. అలాగని మన భాషను విస్మరించడం తగదు. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలను చేపట్టిన సమాజంలో సామాజిక స్పృహ లేకపోతే ఎన్ని కార్యాలు చేసిన అవి బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి. అందుకే మనం మేల్కోవాలి... మన భాషను మాట్లాడుదాం.. తెలుగుని వెలుగుల చాటుదాం.. ఆచరిద్దాం..ఆలోచించండి..








Untitled Document
Advertisements