జనసేన తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్ నేత..

     Written by : smtv Desk | Sat, Mar 10, 2018, 04:45 PM

జనసేన తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్ నేత..

అమరావతి, మార్చి 10 : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌.. మాదాసుకు పుష్పగుచ్ఛం అందించి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నెల 14న గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ సమీపంలో నిర్వహిస్తున్న జనసేన ఆవిర్భావ దినోత్సవ మహాసభ పర్యవేక్షణ బాధ్యతలను మాదాసుకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. మాదాసు గంగాధరం మా కుటుంబ మిత్రుడు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రెండు సార్లు ఎమ్మెల్సీగా, పోలీసు హౌసింగ్‌ బోర్డు చైర్మన్‌గా పని చేసిన అనుభవం ఆయనకుంది. అందుకే జనసేనలోకి ఆహ్వానించానన్నారు. అనంతరం మదాసు గంగాధరం మాట్లాడుతూ.. "ఏడాదిన్నరగా రాజకీయాలకు దూరంగా ఉన్నా.. పవన్‌ నిబద్ధత నాకు తెలుసు. ఆయన ఆహ్వానం మేరకే జనసేనలో చేరాను" అని పేర్కొన్నారు.

Untitled Document
Advertisements