కార్తీక్ తోడుగా..పాండే ఆడగా

     Written by : smtv Desk | Tue, Mar 13, 2018, 11:37 AM

కార్తీక్ తోడుగా..పాండే ఆడగా

కొలంబో, మార్చి 13 : రోహిత్ సేన శ్రీలంక వేదికగా జరుగుతున్నా ముక్కోణపు టీ-20 సిరీస్ లో ఫైనల్ కు చేరువయ్యింది. నిన్న ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ సేన ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉన్న పట్టుసడలని ఆత్మవిశ్వాసంతో ఆడిన మనీష్ పాండే (42), కార్తీక్(39) భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. వర్షం కారణంగా 19 ఓవర్లకు కుదించబడిన ఈ మ్యాచ్ లో తొలుత టాస్ నెగ్గిన టీమిండియా ప్రత్యర్ధిని బ్యాటింగ్ కు ఆహ్వానించింది.

బ్యాటింగ్ కు దిగిన లంక జట్టులో ఓపెనర్‌ గుణతిలక (17), గత రెండు మ్యాచ్‌ల్లో చెలరేగిన కుశాల్‌ పెరీరా (3) విఫలమైనా మరో ఓపెనర్‌ కుశాల్‌ మెండిస్‌ (55) రాణించాడు. ఒక దశలో లంకేయులు భారీ స్కోర్ దిశగా కొనసాగిన టీమిండియా బౌలర్లు పేసర్ శార్దుల్ ఠాకూర్ (4/27), స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ (2/21), తమ పొదుపైన బంతులతో ఆతిధ్య జట్టును కట్టడి చేశారు. దీంతో లంక నిర్ణీత 19 ఓవర్లలో 152 పరుగులు చేసింది.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ కు ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ(11) పేలవ ఫామ్ కొనసాగించగా, ధావన్(8) పరుగులకే వెనుదిరిగాడు. అప్పటికి స్కోర్ 22/2. ఈ దశలో రైనా (27) లంక బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. రైనా ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కే ఎల్ రాహుల్ ఆత్మవిశ్వాసంతో ఆడిన, హిట్ వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరాడు. దీంతో ఒత్తిడిలో ఉన్న భారత్ జట్టును మనీష్ పాండే (42), కార్తీక్(39) ధీటుగా ఆడి విజయాన్ని అందించారు. వీరిద్దరూ రాణించడంతో మరో 9 బంతులు మిగిలుండగానే టీమిండియా లక్ష్యాన్ని ఛేదించింది.

నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన శార్దుల్ ఠాకూర్ 'మ్యాన్ అఫ్ ది మ్యాచ్' దక్కించుకొన్నాడు. ఈ గెలుపుతో రోహిత్ సేన దాదాపు ఫైనల్ కు చేరుకున్నట్లే కాకపోతే బుధవారం బంగ్లాదేశ్ తో జరిగే లీగ్ మ్యాచ్ లో చిత్తుగా ఓడిపోకూడదు.





Untitled Document
Advertisements