బాబు అవినీతిపై విచారణ జరపాలి : పవన్

     Written by : smtv Desk | Mon, Mar 19, 2018, 06:48 PM

బాబు అవినీతిపై విచారణ జరపాలి : పవన్

అమరావతి, మార్చి 19 : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెదేపా ప్రభుత్వంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై కేంద్రం విచారణ జరిపి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ మాట్లాడుతూ.. "లోకేష్ అవినీతికి పాల్పడుతున్నారని స్వయంగా 40 మంది టీడీపీ ఎమ్మెల్యేలే నాతో చెప్పారు. ఈ విషయాన్ని నాలుగేళ్లుగా చంద్రబాబుకు చెబుతూనే వున్నా.. కాని ఆయన పట్టించుకోలేదు. తన ప్రభుత్వ హయాంలో అవినీతి జరుగుతున్నదని బాబుకు స్పష్టంగా తెలుసు. ఆయన స్పందించలేదు కాబట్టే ఆ విషయాన్ని నేను ప్రజలకు చెప్పాను. ఆ పోలవరం ప్రాజెక్ట్ ను కూడా ఓ ప్రైవేటు కాంట్రాక్టర్‌కు అప్పగించడం వెనక కూడా ఏదో దురుద్దేశం ఉంది" అని వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. లోకేష్ అవినీతి గురించి మోదీకి చెప్పలేదా.? అన్న ప్రశ్నకు.. ప్రధాని తనకు దగ్గరగా తెలిసినా.. తనకు కొన్ని పరిమితులున్నాయని తెలిపారు. నేను లోకేష్ ఆరోపణలు చేస్తుంటే.. నా వెనుక మోదీ ఉన్నారని మాట్లాడుతున్నారు. ఆనాడు వైసీపీ జగన్ నా వెనుక చంద్రబాబు ఉన్నాడని ఆరోపించారు. కాని వారిద్దరూ తప్పే. నా వెనుక కేవలం ప్రజలే ఉన్నారని స్పష్టం చేశారు. రాష్ర్టానికి హోదా వస్తుందా రాదా అన్నది అనవసరం. ప్రస్తుతం రాష్ర్టానికి కేంద్రం ఆర్థిక సాయం కావాలి. మా డిమాండ్లను నెరవేర్చుకునే వరకు బీజేపీపై పోరాటం ఆగదన్నారు. ప్రస్తుతానికి ఒంటరి పోరాటం చేస్తున్నా. అవసరమైతే ఎన్నికల సమయంలో ఎవరితో పొత్తు పెట్టుకొవాలో నిర్ణయించుకుంటామని తెలిపారు.





Untitled Document
Advertisements