జలమే జీవనాధారం..

     Written by : smtv Desk | Thu, Mar 22, 2018, 11:50 AM

జలమే జీవనాధారం..

హైదరాబాద్, మార్చి 22 : ప్రకృతిలో పంచభూతాలు మానవాళి మనుగడకు అత్యంత ముఖ్యమైనవి. భూమి, ఆకాశం, నీరు, గాలి, అగ్ని ఇవన్నీ లేకుండా సృష్టి ఉండడం అనేది జరగని పని. ఇందులో జల ప్రాధాన్యత కోసం వేరే చెప్పాల్సిన అవసరం లేదు. కానీ తరగని వనరుగా ఉన్న నీరు కొంతమందికి దొరకక అల్లాడిపోతున్నారు. మొత్తం భూభాగంలో 97 శాతం గల నీరు మానవుల కనీస అవసరాల కోసం సరిపోవట్లేదు అంటే నమ్మలేకపోతున్నారా..? కానీ ఇది నిజం.. ఈ రోజు 'ప్రపంచ జల దినోత్సవం' (మార్చి 22) భూతలంపై సుమారు 70 శాతం సముద్రాలు, నదుల రూపంలో నీరు ఆవరించి ఉంది. భూమిపై సుమారు 140 కోట్ల ఘన కిలోమీటర్ల నీటి పరిమాణం ఉన్నట్లు అంచనా.

ఇంత పెద్ద మొత్తంలో నీరు ఉన్నప్పటికీ, తాగడానికి గుక్కెడు నీటి కోసం ప్రజలు పడుతున్న పాట్లు మాత్రం వర్ణించలేనివి. మంచినీటిలో కేవలం ఒక్క శాతం అంటే 38 లక్షల ఘన కిలోమీటర్ల నీరు మాత్రమే మానవాళి వినియోగానికి అందుబాటులో ఉంది. ఈ కొద్దినీరైనా సమానంగా అందితే అది జనాభా అవసరాలకు సరిపోతుంది.


ఐక్యరాజ్య సమితి ఈ ఏడాది నిర్వహించే ప్రపంచ జల దినోత్సవానికి ‘నీటి సమస్యకు ప్రకృతి సిద్ధమైన పరిష్కారం’ అనే ఇతివృత్తాన్ని ప్రకటించింది. 21వ శతాబ్దంలో ప్రపంచ దేశాలు నీటిసవాళ్లను ఎలా ఎదుర్కోవాలో చర్చించి, పరిష్కారాలను అన్వేషించాల్సి ఉంటుంది. మారిన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ సురక్షితమైన నీరు అందించటం అసాధ్యమవుతోంది. ‘సమ్మిళిత అభివృద్ధి కోసం జలాలు’ నినాదంతో 2018 నుంచి 2028 వరకు పదేళ్లపాటు నీటి నిర్వహణ తీరుతెన్నులకు ప్రాధాన్యం ఇవ్వాలని 2016 డిసెంబరులో ఐరాస నిర్ణయించింది.

ప్రస్తుతం పెరుగుతున్న నగరీకరణ, సాంకేతికత కారణంగా ప్రజల ధోరణి 'తను కూర్చున్న కొమ్మను తానే నరుక్కొనే' మూర్ఖుడులా తయారయ్యింది. అధికమవుతున్న అవసరాల కొరకు వాడకం పెరగడం దానికి తోడు పరిశ్రమలు విడుదల చేసే కాలుష్యం వలన నీటి కాలుష్యం జరగడంతో అవి కనీస అవసరాలకు ఉపయోగపడట్లేదు.

అంతకు తోడు వేసవికాలం వచ్చిదంటే చాలు కొన్ని ప్రాంతాలకు నీటి ఎద్దడి తాకిడి అధికంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు తమ భాద్యతగా వాన నీటి సంరక్షణ, భూగర్భ జలాలను పెంపొందించుకోవడం, పొదుపుగా నీటిని వినియోగించుకోవడం, పంట మార్పిడి తదితర ప్రక్రియలను చేపట్టడం అవసరం. ప్రభుత్వాలు కూడా నదుల అనుసంధానం, వరద నీటిని కొరత ప్రాంతాలకు మళ్లించడం వంటి చర్యలు చేపట్టడం చేయాలి.





Untitled Document
Advertisements