అవినీతి కేసులో మెజిస్ట్రేట్‌ అరెస్టు

     Written by : smtv Desk | Sat, Apr 07, 2018, 12:27 PM

అవినీతి కేసులో మెజిస్ట్రేట్‌ అరెస్టు

జగిత్యాల, ఏప్రిల్ 7: అవినీతి కేసులో జగిత్యాల మొదటి శ్రేణి జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ మధును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అవినీతి ఆరోపణలపై హైకోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు శుక్రవారం రాత్రి కరీంనగర్‌ ఏసీబీ న్యాయస్థానానికి తరలించారు. ఈ సంఘటన న్యాయవర్గాల్లో సంచలనం సృష్టించింది. మెజిస్ట్రేట్‌ మధుపై పలు ఆరోపణలతో జగిత్యాల బార్‌ అసోసియేషన్‌ ఇటీవల జిల్లా న్యాయమూర్తికి, హైకోర్టులో ఫిర్యాదు చేసింది. కేసుల కొట్టివేతకు లంచం డిమాండ్‌ చేస్తున్నట్లు పలు ఆధారాలతో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో గురువారం ఏసీబీ కరీంనగర్‌ అధికారులు మెజిస్ట్రేట్‌ మధుపై కేసు నమోదు చేశారు. అటెండర్‌ ఫోన్‌ ద్వారా న్యాయవాదులకు ఫోన్‌ చేయించి కేసులు కొట్టివేసేందుకు లంచం అడిగారని ఇద్దరు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. ఒక కేసులో రూ. 10 వేలు, మరో కేసులో రూ. 50 వేలు లంచం ఇచ్చినట్లు న్యాయవాదులు రామక్రిష్ణారావు, వెంకట్వేర్‌రావు ఏసీబీ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు.

శుక్రవారం ఉదయం ఏసీబీ అదనపు ఎస్పీ మాదాడి రమణకుమార్‌, డీఎస్పీ కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో 20 మంది బృందం మెజిస్ట్రేట్‌ మధు ఇంటికి వచ్చారు. ఇంట్లో సోదాలు నిర్వహించగా మంచంలో పరుపు కింద లెక్కలు చూపని రూ. 4.20 లక్షలు నగదు, ఒకే కేసులో కోర్టులో డిపాజిట్‌ చేసిన ఆరు సెల్ఫోన్లు స్వాధీన౦ చేసుకొన్నారు. అటెండర్‌ ఠాకూర్‌ రఘువీర్‌సింగ్‌ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసుకున్నారు. ఈ దాడిలో సీఐలు వెంకటేశ్వర్లు, రేగులపాటి సతీష్‌, వాసాల సతీష్‌, రమణమూర్తి, సంజీవ్‌, రాము, వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు





Untitled Document
Advertisements