సున్నీ వక్ఫ్‌ బోర్డుకు షాకిచ్చిన సుప్రీం

     Written by : smtv Desk | Wed, Apr 11, 2018, 06:26 PM

 సున్నీ వక్ఫ్‌ బోర్డుకు షాకిచ్చిన సుప్రీం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11 : ప్రపంచ ప్రఖ్యాత కట్టడాల్లో ఒకటైన తాజ్‌మహల్‌ తమదేనన్నఉత్తరప్రదేశ్‌ సున్నీ వక్ఫ్‌ బోర్డు వాదనకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. తాజ్ మీదే అయితే షాజహాన్‌ సంతకం చేసిన ఒరిజినల్‌ డీడ్‌ చూపించండి అని ఆదేశించింది. మొగల్ చక్రవర్తి అయిన షాజహాన్‌ తన భార్య ముంతాజ్‌ కోసం తాజ్‌మహల్‌ను నిర్మించిన సంగతి తెలిసిందే. కాగా షాజహాన్‌ దీన్ని నిర్మించిన 18ఏళ్ల తర్వాత 1666లో మరణించారు. అయితే 2005లో వక్ఫ్‌ బోర్డు తాజ్‌ను తమ ఆస్తిగా వెల్లడించింది.

వక్ఫ్‌ బోర్డుకు వ్యతిరేకంగా భారత పురావస్తు శాఖ 2010లో దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. తాజ్‌మహల్‌ను నిర్మించిన షాజహాన్‌ తాజ్‌ మహల్‌ను వక్ఫ్‌ బోర్డు ఆస్తిగా ప్రకటించారని వక్ఫ్‌ బోర్డు వాదిస్తుంది. అయితే ఈ మేరకు షాజహాన్‌ సంతకాలు చేసిన పత్రాలు సమర్పించండి అని కోర్టు వక్ఫ్‌ బోర్డును ఆదేశించింది. వారం రోజుల్లోగా ఆ పత్రాలు సమర్పించాలని చెప్పింది.

'తాజ్‌ మహల్‌ వక్ఫ్‌ బోర్డుకు చెందుతుంది అంటే భారతదేశంలో ఎవరు నమ్ముతారు? ఇలాంటి విషయాలతో సుప్రీంకోర్టు అమూల్యమైన సమయాన్ని వృథా చేయడం తగదు' అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది.





Untitled Document
Advertisements