గోడకూలి ముగ్గురు చిన్నారులు మృతి

     Written by : smtv Desk | Thu, Apr 12, 2018, 05:31 PM

గోడకూలి ముగ్గురు చిన్నారులు మృతి

ఒంగోలు, ఏప్రిల్ 12: ప్రకాశం జిల్లా కొత్తడొంకలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న గోడ కూలడంతో ముగ్గురు చిన్నారులు మృతిచెందగా, మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన గురువారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. దాదాపు ఎనమిదేళ్ల వయసున్న చిన్నారులు గుడిమెట్ల నవదీప్, కట్టా మణికంట, ప్రేమ్‌చంద్‌తో పాటు బాలుడి సోదరి సింధే ప్రేమ జ్యోతి స్కూలు నుంచి ఇంటికొచ్చారు. అయితే వారి ఇంటి పక్కన నిర్మాణంలో ఉన్న భవనం వద్దకెళ్లి ఆడుకుంటున్నారు.

ఇంతలోనే నిర్మాణంలో ఉన్న గోడకూలి చిన్నారుల మీద పడింది. ఈ దుర్ఘటనలో నవదీప్ అక్కడికక్కడే మృతి చెందగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మణికంఠ, ప్రేమ్‌చంద్ మృత్యువాత పడ్డారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రేమ జ్యోతి చికిత్స పొందుతోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Untitled Document
Advertisements