దక్షిణాది రాష్ట్రాల ఆరోపణల్లో వాస్తవం లేదు: ప్రధాని

     Written by : smtv Desk | Thu, Apr 12, 2018, 06:29 PM

దక్షిణాది రాష్ట్రాల ఆరోపణల్లో వాస్తవం లేదు: ప్రధాని

చెన్నై, ఏప్రిల్ 12 : 15వ ఆర్దికసంఘం నియమాలు వలన దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆయా రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు కేంద్రప్రభుత్వ విధానంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో పథకాలు ద్వారా అభివృద్ధి చెందుతూ దేశానికి పన్నురూపంలో అధిక రాబడి ఇస్తుంటే వాటిని ఉత్తరాది రాష్ట్రాలుకు పంచడం ఎంతవరకు సమంజసమని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయం పై స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ విమర్శలను కొట్టిపారేశారు.

ఏ రాష్ట్రాల తరఫున కూడా ఆర్థిక సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరించబోదని ప్రధాని స్పష్టం చేశారు. జనాభా నియంత్రణను పాటించిన రాష్ట్రాలకు ప్రోత్సాహకాలివ్వాలని ఆర్థిక సంఘానికి సూచించినట్లు ప్రధాని వెల్లడించారు. ఆర్థిక సంఘంపై వస్తున్న విమర్శలు పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తున్నారన్న ఆయన.. భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు.


ఇటీవల కేరళలోని తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సమావేశమై 15వ ఆర్థిక సంఘం 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవడాన్ని తప్పుబట్టిన విషయం తెలిసిందే. 1971 జనాభాలెక్కల ఆధారంగా పన్నుల వాటాలో నిధులు కేటాయించాలని, లేని పక్షంలో ఆర్థికంగా నష్టపోతామని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్‌ చేస్తున్నాయి.





Untitled Document
Advertisements