పడవ బోల్తా ఇద్దరి మృతి

     Written by : smtv Desk | Fri, Apr 13, 2018, 12:37 PM

 పడవ బోల్తా ఇద్దరి మృతి

నందివాడ, ఏప్రిల్ 13: చేపల చెరువులో రేకు పడవ బోల్తాపడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మండలంలోని తమిరిశ గ్రామంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలతో బయటపడింది. పోలీసుల కథనం ప్రకారం గుడివాడకు చెందిన కత్తుల సత్యనారాయణ (40) తమిరిశలో సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో చేపల చెరువు సాగు చేస్తున్నాడు. చెరువులో మందు చల్లటం కోసం గురువారం రేకు పడవపై విజయనగరం జిల్లా కొమరాడ మండలం గున్ననపురం గ్రామానికి చెందిన వలస కూలీలు బొండుపల్లి ఆదినారాయణ (34), మంగమ్మ (32) లను తీసుకువెళ్లాడు. చెరువు మధ్యలోకి వెళ్లగానే నీటితో పడవ ఊగటం ప్రారంభమైంది. భయపడిన పడవలోని ముగ్గురూ అటూఇటూ కదలడంతో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో పడవలో ఉన్న ముగ్గురు చెరువులో పడిపోయారు.

చెరువు యజమాని కత్తుల సత్యనారాయణ గల్లంతుకాగా, వలస కూలీ ఆదినారాయణ ఈదుకుంటూ మంగమ్మను కూడా రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చాడు. చాలా దూరం ఈదటం వల్ల ఆదినారాయణ ఊపిరి అందక ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న నందివాడ ఎస్సై ఎ.మణికుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమి త్తం గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Untitled Document
Advertisements