బెంగుళూరుకు తొలి గెలుపు

     Written by : smtv Desk | Sat, Apr 14, 2018, 10:53 AM

బెంగుళూరుకు తొలి గెలుపు

బెంగుళూరు, ఏప్రిల్ 14 : ఐపీఎల్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ X1 తో జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ) విజయం సాధించింది. సొంత గడ్డపై ఈ గెలుపుతో బెంగుళూరు జట్టు టోర్నీలో తొలి విజయం నమోదు చేసింది. ఒక దశలో పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ చివరిలో స్టార్ ఆటగాడు ఏబీ డీవీలియర్స్ (57) రాణించడంతో కింగ్స్ X1కు ఓటమి తప్పలేదు. 'మిస్టర్ 360' సూపర్ ఇన్నింగ్స్ తో ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.


తొలుత టాస్ నెగ్గిన ఆర్సీబీ సారథి కోహ్లి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు కే ఎల్ రాహుల్ (47), కెప్టెన్ అశ్విన్ (33), కరుణ నాయర్ (29) రాణించారు. బెంగుళూరు జట్టు బౌలర్ ఉమేష్ యాదవ్(3/23) తను వేసిన నాలుగో ఓవర్లో ఏకంగా మూడు వికెట్లు తీసి పంజాబ్ జట్టును కోలుకోలేని దెబ్బ తీశాడు. మిగతా బౌలర్లు వాషింగ్టన్‌ సుందర్‌ (2/22), ఖెజ్రోలియా (2/33)ల ధాటికి పంజాబ్‌ 19.2 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌటైంది.

తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన విరాట్ జట్టులో ఛేదనలో ఓపెనర్‌ మెక్‌కలమ్‌ (0), కోహ్లి (21) విఫలమయ్యారు. మరో వైపు డికాక్‌ (45), డివిలియర్స్‌ నిలకడగా ఆడటంతో బెంగళూరు కుదురుకుంది. ఈ దశలో అశ్విన్‌ వరుస బంతుల్లో డి కాక్, సర్ఫరాజ్‌ (0)లను అవుట్‌ చేసి పంజాబ్‌లో శిబిరంలో ఆశలు రేపాడు. కానీ ఏబీడీ సరైన సమయంలో చెలరేగి సమీకరణాలను మార్చేశాడు. దీంతో రాయల్‌ చాలెంజర్స్‌ 19.3 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 159 పరుగులు చేసింది. మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు ను ఉమేష్ యాదవ్ దక్కించుకొన్నాడు.





Untitled Document
Advertisements