మాజీ మంత్రి హెచ్చరికతో కలెక్టర్‌ మనస్తాపం

     Written by : smtv Desk | Sun, Apr 15, 2018, 05:13 PM

మాజీ మంత్రి హెచ్చరికతో కలెక్టర్‌ మనస్తాపం

మూసాపేట, ఏప్రిల్ 15: అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో భాగంగా సభావేదికపై మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ ఎం.వి.రెడ్డి మనస్తాపంతో కంటతడి పెట్టుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ తనను కార్యక్రమానికి ఆహ్వానించలేదంటూ కలెక్టర్‌ను హెచ్చరించడంతో సభలో కలకలం చెలరేగింది. స్థానిక కాంగ్రెస్‌, తెరాస వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ పరిణామాలతో కలెక్టర్‌ మనస్తాపానికి గురై అక్కడి నుంచి వెళ్లిపోయారు. హైదరాబాద్‌ మూసాపేట వై జంక్షన్‌లో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద శనివారం మేడ్చల్‌ జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన జయంతి కార్యక్రమానికి హాజరైన కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ తనను ఎందుకు ఆహ్వానించలేదంటూ కలెక్టర్‌ను వేదికమీదే నిలదీశారు.

కలెక్టర్‌, ఎమ్మెల్యేలు తనను అవమానపరిచారని, దళితుడినైనందునే తనకు ప్రసంగించే అవకాశం ఇవ్వలేదని సర్వే ఉద్వేగపూరిత స్వరంతో అన్నారు. సభ అర్ధంతరంగా నిలిచిపోయింది. సర్వే తీరును దళితుల ఐక్యవేదిక అధ్యక్షుడు నపారి చంద్రశేఖర్‌ మీడియా సమావేశంలో ఖండించారు. సర్వేను 24గంటల్లో అరెస్టు చేయాలని తెలంగాణ తహసీల్దార్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి, అధ్యక్షుడు గౌతమ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు

Untitled Document
Advertisements