నాకు ఆరెంజ్‌ క్యాప్ ధరించాలని లేదు : విరాట్

     Written by : smtv Desk | Wed, Apr 18, 2018, 04:37 PM

నాకు ఆరెంజ్‌ క్యాప్ ధరించాలని లేదు : విరాట్

ముంబై, ఏప్రిల్ 18: ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసే బ్యాట్స్ మెన్ కు ఇచ్చే ఆరెంజ్‌ క్యాప్‌ బెంగుళూరు సారథి విరాట్ కోహ్లికి చేరింది. అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్లు తీసే ఆటగాళ్లకు ఇచ్చే ఆరెంజ్‌, పర్పుల్‌ రంగుల క్యాప్‌ ధరించాలని ఆటగాళ్లు కోరుకుంటారు. కానీ కోహ్లీ మాత్రం తనకి ఇప్పుడు ఆరెంజ్‌ క్యాప్‌ ధరించడం ఇష్టం లేదని వ్యాఖ్యానించాడు.

ఈ టోర్నీలో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 201 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌ను దక్కించుకొన్నాడు. మ్యాచ్‌ తర్వాత కోహ్లీ మాట్లాడుతూ.. "నిజానికి నాకు ఇప్పుడు ఆరెంజ్‌ క్యాప్‌ ధరించాలని లేదు. ముంబయి చాలా బాగా ఆడింది. ముంబయిని మొదట్లోనే రెండు వికెట్లు తీసి దెబ్బతీశాం. కానీ, ఆ తర్వాత మాకు మ్యాచ్‌ను మలుపుతిప్పే ఒక్క అవకాశాన్ని కూడా ముంబయి ఇవ్వలేదు. మా బ్యాటింగ్‌ ఇన్నింగ్స్‌లో ఒకటి లేదా రెండు మంచి భాగస్వామ్యాలు నమోదైతే మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేది. ముంబయి ఇండియన్స్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు" అని కోహ్లి అన్నాడు

టోర్నీలో భాగంగా మంగళవారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 46 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 92 పరుగులతో నాటౌట్‌గా నిలిచినా మిగతా బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో బెంగుళూరు ఓటమి పాలయ్యింది.





Untitled Document
Advertisements