'ధర్మ పోరాట దీక్ష'కు పవన్ కౌంటర్ ఎటాక్ ఇస్తున్నారా..?

     Written by : smtv Desk | Fri, Apr 20, 2018, 01:57 PM

 'ధర్మ పోరాట దీక్ష'కు పవన్ కౌంటర్ ఎటాక్ ఇస్తున్నారా..?

హైదరాబాద్, ఏప్రిల్ 20 : టాలీవుడ్ లో 'కాస్టింగ్ కౌచ్' వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం ఈ రచ్చ తీవ్ర ఉదృత రూపం దాల్చింది. నటి శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ ను దూషించడం నుండి ఈ గొడవ మరో కొత్త మలుపు తిరిగింది. ఆ వ్యాఖ్యల వెనుక సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తనే అలా మాట్లాడించాను అనడంతో ఒక్కసారిగా ఈ మాటల వెనుక ఎదో రాజకీయ కుట్ర ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దీనికి బలమిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్లు ఇప్పుడు ప్రస్తుత రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా రాజకీయంగా ఎదుర్కోలేక తన తల్లిని తిట్టడంపట్ల పవన్ చాలా భావోద్వేగానికి లోనయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు, అతని కుమారుడు లోకేష్, కొన్ని మీడియా సంస్థలు తనను లక్ష్యంగా చేసుకొని ఈ వివాదంలోకి లాగారని పవన్ కళ్యాణ్ అంటున్నారు.

చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రప్రభుత్వం చేసిన మోసంపై ఈ రోజు ధర్మ పోరాట దీక్షకు దిగారు. ఇదే సమయంలో పవన్ తనపై వస్తున్న విమర్శలకు ఫిలింఛాంబర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఓ వైపు చంద్రబాబు ధర్మపోరాట దీక్షను భగ్నం చేయాలనే జనసేన అధినేత కౌంటర్ ఎటాక్ ఇస్తున్నాడని చాలా మంది భావిస్తున్నారు.


2014 లో టీడీపీ ఏపీలో అధికారంలోకి రావడానికి పవన్ తన మద్దతు తెలిపినా.. ప్రస్తుతం జనసేన కూడా ఏపీలో బలోపేతం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది. 2019 ఎన్నికలల్లో పోటీ చేస్తామని పవన్ చెప్పడం.. మరో వైపు జనసేన, టీడీపీ వైరం తారాస్థాయికి చేరుకోగా,ఈ వివాదం ఇరు పార్టీలకు విషమ పరీక్షగా నిలిచింది.

ఈ వివాదానికి కేంద్ర బిందువు అయిన శ్రీరెడ్డి ఇంతవరకు బయటకు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పవన్ అన్న వ్యాఖ్యలు నిజమైతే వాటికి తగిన ఆధారాలు చూపాలి. అదే జరిగితే వచ్చే ఎన్నికల ముందు అధికార టీడీపీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఏది ఏమైనా వివాదం ముదిరి రాజకీయ పార్టీల మనుగడ మీద ప్రభావం చూపడం ఖాయంగా కన్పిస్తుంది.









Untitled Document
Advertisements