ఆర్డినెన్సుకు రాష్ట్రపతి ఆమోదం..

     Written by : smtv Desk | Sun, Apr 22, 2018, 12:30 PM

ఆర్డినెన్సుకు రాష్ట్రపతి ఆమోదం..

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22 : దేశంలో నానాటికి పెరిగిపోతున్న మహిళాల అత్యాచారాలపై కేంద్రప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకొనేదిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా పన్నెండేళ్లలోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణశిక్ష విధిస్తూ శనివారం కేంద్రం తెచ్చిన ఆర్డినెన్సుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.

ఈమేరకు ఈ ఆర్డినెన్సుపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదివారం సంతకం చేశారు. దీని ప్రకారం పన్నెండేళ్లలోపు చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణశిక్ష పడనుంది. కథువా, ఉన్నావ్‌, సూరత్‌లో మైనర్లపై జరిగిన అత్యాచార ఘటనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నవిషయం తెలిసిందే.

ఆర్డినెన్సులో అంశాలు..

*మహిళలపై జరిగే అత్యాచారాలకు ఇప్పటి వరకూ ఉన్న ఏడేళ్ల శిక్షను పదేళ్లకు పెంచారు. నేర తీవ్రతను బట్టి ఇది జీవితఖైదుగా మారవచ్చు.

*16ఏళ్లలోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడిన వారికి ప్రస్తుతం ఉన్న 10సంవత్సరాల జైలు శిక్షను 20ఏళ్లకు పెంచారు.

*12ఏళ్లలోపు చిన్నారులపై సామూహిక అత్యాచారానికి పాల్పడే వారికి కనీస శిక్షగా జీవిత ఖైదు లేదా మరణశిక్షగానీ విధిస్తారు. దీనికి సంబంధించిన అప్పీళ్లపై ఆయా ఉన్నత న్యాయస్థానాలు ఆరు నెలల్లో వారి నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉంటుంది.

*16ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారం, మూకుమ్మడి అత్యాచారాలకు పాల్పడిన వారికి ఎటువంటి ముందస్తు బెయిళ్లూ ఇవ్వకూడదు. దీనిపై నిర్ణయం తీసుకునే ముందు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు, బాధితుల తరఫు బంధువులకు కనీసం రెండు వారాల ముందస్తు నోటీసులు ఇవ్వాలి.





Untitled Document
Advertisements