ఇంట్లో పెళ్లి సంబంధాలు...నిందలు భరించలేక తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

     Written by : smtv Desk | Tue, Feb 09, 2021, 10:55 AM

ఇంట్లో పెళ్లి సంబంధాలు...నిందలు భరించలేక తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

అమ్మ చనిపోయింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రి పట్టించుకోవడం మానేశాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మమ్మ ఇంట్లో ఉండాల్సి వస్తోంది. చదివేది తొమ్మిదో తరగతే అయినా వయసుకు మించి కష్టాలు అనుభవిస్తోంది. అన్నింటినీ భరిస్తూ ఉన్నతంగా చదువుకుని జీవితాన్ని సరిదిద్దుకోవాలనుకుంటున్న సమయంలో అనుకోని కష్టం వచ్చింది. ఆమె బాధ్యతను త్వరగా తీర్చుకోవాలన్న ఉద్దేశంతో పెద్దలు ఆమెకు పెళ్లి సంబంధం చూశారు. తెలిసీ తెలియని వయసులో తనకు పెళ్లి చేస్తున్నారన్న మనస్తాపంతో తల్లి చీరతోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. క్షమించు అమ్మమ్మా.. నిందల్ని భరించలేకపోతున్నా.. అంటూ బాలిక రాసిన సూసైడ్‌ నోట్‌ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. మనసులను కలిచివేసే ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్‌ మండలం మంబాపూర్‌లో సోమవారం జరిగింది. మంబాపూర్‌ గ్రామానికి చెందిన అనంతమ్మకు మొత్తం ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు. వీరిలో వెంకటమ్మ అనే కూతురిని జనగాం గ్రామానికి చెందిన హన్మంతుకు ఇచ్చి వివాహం చేసింది. హన్మంతు మంబాపూర్‌లోనే ఇల్లు కట్టుకుని 16 ఏళ్లుగా అక్కడే ఉంటున్నాడు. హన్మంతు, వెంకటమ్మలకు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. వీరిలో ఓ కూతురు, ఓ కొడుకు కొంతకాలం క్రితం చనిపోయారు. వాళ్లు మరణించిన కొద్ది రోజులకే హన్మంతు భార్య వెంకటమ్మ కూడా అనారోగ్యంతో చనిపోయింది. దీంతో హన్మంతు మిగిలిన ఒక్క కూతురు రేణుక(14)ను అమ్మమ్మ దగ్గర విడిచిపెట్టి హైదరాబాద్‌లో పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అయితే రేణుకకు పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు కొంత కాలంగా సంబంధాలు చూస్తున్నారు. తాను చదువుకుంటానని, అప్పుడే పెళ్లి వద్దని బాలిక వారించినా వారు వినిపించుకోవడం లేదు. దీనికి తోడు లేనిపోని నిందలు వేస్తుండటంతో రేణుక మనస్తాపానికి గురైంది. సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అమ్మ చీరతో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. రేణుక అమ్మమ్మ అనంతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. ‘అమ్మమ్మా.. నన్ను క్షమించు.. నిందలు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నా’ అంటూ బాలిక రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేణుక మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.







Untitled Document
Advertisements