"కూతురు చదువు ఆగిపోతుంది...కిడ్నీలు అమ్ముకునేందుకు అనుమతివ్వండి"

     Written by : smtv Desk | Wed, Apr 14, 2021, 05:59 PM


కూతురు ఎంబీబీస్ పరీక్ష ఫీజు కోసం కట్టేందుకు డబ్బుల్లేక కిడ్నీలు అమ్ముకునేందుకు అనుమతివ్వాలంటూ అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుకు దంపతులు మొరపెట్టుకున్నారు. విదేశీ విద్యకు ప్రభుత్వం అందించే సాయంతో ముందుకెళ్దామనుకున్న ఆ తల్లిదండ్రులు.. ఇప్పుడు అది రావట్లేదని తెలసి దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తమ దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతో కూతురిని ఎంబీబీఎస్‌ చదివేందుకు 16 నెలల క్రితం ఫిలిప్పీన్స్‌ పంపించారు. ప్రస్తుతం కుమార్తె వైద్య విద్య రెండో సంవత్సరం చదువుతోంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉపకారవేతనం రాకపోవడం, తన ఇల్లు అమ్ముకొనేందుకు అడ్డంకులు ఎదురుకావడంతో కుమార్తె చదువు ఆగిపోతుందని ఆవేదన చెందిన తల్లిదండ్రులు.. చివరకు తమ కిడ్నీలు అమ్ముకోవడానికి సిద్ధపడ్డారు.


అనంతపురం జిల్లా హిందూపురం ఆజాద్‌నగర్‌లో మక్బుల్‌జాన్‌, అయూబ్‌ఖాన్‌ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె రుబియా ఎంబీబీఎస్‌ చదివేందుకు ఫిలిప్పీన్స్‌లోని దవావో నగరానికి 16 నెలల క్రితం వెళ్లారు. అయితే, విదేశీ విద్యకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం పథకం అమలుకాక ఇబ్బంది ఎదురైంది. దీంతో మక్బుల్‌జాన్‌ గత రెండు నెలలుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగారు.

ఈ విషయమై గతంలో హిందూపురం తహసీల్దార్‌ కార్యాలయం దగ్గర దీక్ష కూడా చేశారు. దీంతో న్యాయం చేస్తామని తహసీల్దార్‌ హామీ ఇవ్వడంతో అప్పట్లో దీక్ష విరమించారు. కానీ, ఇంత వరకు ఎలాంటి సమాచారం రాలేదు. అయితే, పరీక్షలు రాయాలంటే ఈ నెల 17వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంది. కానీ, అధికారుల నుంచి ఉపకార వేతనం విషయమై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారమూ అందలేదని మక్బుల్‌జాన్‌ వాపోయారు.

ఒకవేళ, ప్రభుత్వం స్కాలర్‌షిప్ మంజూరు చేయకపోతే.. తమ కిడ్నీలు అమ్ముకుని కూతురు ఫీజు చెల్లించుకుంటానని మక్బుల్ జాన్ పేర్కొన్నారు. ఇందుకోసం తనకు అనుమతి ఇవ్వాలని భర్తతో కలిసి మక్బుల్‌జాన్‌ సోమవారం అనంతపురం వచ్చి కలెక్టర్‌ గంధం చంద్రుడుకు అర్జీ పెట్టుకున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. తమ కిడ్నీలు అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాలని.. లేకుంటే కనీసం తమ కుమార్తె విద్య కోసం ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నారు.





Untitled Document
Advertisements