తిరుపతిలో దొంగ ఓట్లు...ఎన్నికల అధికారి కీలక ఆదేశాలు జారీ!

     Written by : smtv Desk | Sat, Apr 17, 2021, 06:03 PM

తిరుపతిలో దొంగ  ఓట్లు...ఎన్నికల అధికారి కీలక ఆదేశాలు జారీ!

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదవుతున్నాయని ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి కె.విజయానంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నకిలీ ఓట్లపై టీవీలు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించిన విజయానంద్‌.. చిత్తూరు, నెల్లూరు కలెక్టర్లు, ఎస్పీలు, రిటర్నింగ్‌ అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు. సచివాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ రూం నుంచి పోలింగ్‌ పరిస్థితిని విజయానంద్ సమీక్షించారు. దొంగ ఓట్లు వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగనీయొద్దని స్పష్టం చేశారు. కాగా, తిరుపతిలో దొంగ ఓట్లు వేసేందుకు ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు రావడంతో టీడీపీ నేతలు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. తిరుపతిలో నకిలీ ఓటర్ల విషయంపై టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు ఉదయం నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ తరుణంలో ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో టీడీపీ ఎంపీలే సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్ మాట్లాడారు. తిరుపతి ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. పోలింగ్‌లో జరిగిన ఘటనల వీడియోలను ఎంపీలు అందించారు. నకిలీ ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్‌ల దగ్గర తిరగడం.. బస్సుల్లో నకిలీ ఓటర్లను తరలించడంపై ఫిర్యాదు చేశారు.


Untitled Document
Advertisements