స్కూల్‌లో చిన్నారులపై లైంగిక వేధింపులు...బయటపడ్డ మరో దొంగ బాబా

     Written by : smtv Desk | Thu, Jun 17, 2021, 12:47 PM

స్కూల్‌లో చిన్నారులపై లైంగిక వేధింపులు...బయటపడ్డ మరో దొంగ బాబా

లైంగిక వేధింపుల కేసులో మరో స్వామీజీ చిక్కుకున్నారు. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడుకు చెందిన శివశంకర్ బాబా (71) గత కొద్ది రోజులుగా పరారీలో ఉన్నారు. పోలీసు కేసులకు భయపడి తప్పించుకు తిరుగుతున్న బాబాను ఢిల్లీ సమీపంలో సీబీసీఐడీ అరెస్ట్ చేసింది. చెన్నైలోని కేలంబాక్కంలో సుశీల్‌హరి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ను శివశంకర్‌ బాబా నిర్వహిస్తున్నారు. పదేళ్ల కిందట శివశంకర్ బాబా తనను తాను వేంకటేశ్వరస్వామిగా ప్రకటించకున్నారు.

స్వామివారి ఆ వేషధారణతో వంటి నిండా బంగారు అభరణాలను ధరించి భక్తులకు దర్శనమిచ్చి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. సుశీల్‌ హరి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ను బాబా నడుపుతున్నారు. గత కొన్నేళ్లుగా అక్కడ చదువుతున్న విద్యార్థినులపై శివశంకర్‌ బాబా, ఆయన శిష్యులు లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం ఇటీవలే వెలుగులోకి వచ్చింది. ఆ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థినుల సోషల్ మీడియా ద్వారా వారి దురాగతాలను బయటపెట్టారు.

దీంతో మహాబలిపురం పోలీసులు శివశంకర్‌బాబా సహా ఆరుగురిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసు విచారణను సీబీసీఐడీకి బదిలీ చేయడంతో.. పరారీలో ఉన్న ఆయన కోసం తీవ్రంగా గాలించారు. అనారోగ్యంతో డెహ్రాడూన్‌లోని ఓ ఆస్పత్రిలో శివశంకర్ బాబా చికిత్స పొందుతున్నారని మంగళవారం పోలీసులకు రహస్య సమాచారం అందింది.

దీంతో పోలీసులు హుటాహుటిన విమానంలో బయల్దేరి డెహ్రాడూన్‌ చేరుకున్నారు. అయితే,
తమిళనాడు పోలీసులు వస్తున్నట్టు తెలుసుకున్న శివశంకర్‌ బాబా ఆస్పత్రి నుంచి జారుకున్నాడు. ప్రత్యేక బృందం ఆయన ఆచూకీ కోసం ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టడంతో చివరకు బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ సమీపంలో శివశంకర్‌ బాబా దాగి ఉన్నట్టు గుర్తించారు. ఈ విషయం గురించి ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగారు. శివశంకర్‌ బాబాను అదుపులోకి తీసుకుని సీబీసీఐడీ పోలీసులకు అప్పగించారు.

మతపరమైన కార్యక్రమం కోసం డెహ్రడూన్‌ వెళ్లిన బాబా.. జూన్ 8న అక్కడ గుండెపోటుకు గురయినట్టు సుశీల్ హరి స్కూల్ యంత్రాంగం వెల్లడించింది. వారం రోజులు అక్కడ ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.

Untitled Document
Advertisements