ఆన్ లైన్‌లో రూ.లక్ష పెట్టి చీర ఆర్డర్...CI భార్యకు షాక్ ఇచ్చిన సైబర్ నేరగాళ్లు

     Written by : smtv Desk | Thu, Jun 17, 2021, 01:43 PM

ఆన్ లైన్‌లో రూ.లక్ష పెట్టి చీర ఆర్డర్...CI భార్యకు షాక్ ఇచ్చిన సైబర్ నేరగాళ్లు

కరోనా భయంతో ఈ మధ్య అంతా ఆన్ లైన్ షాపింగ్ చేసుకుంటున్నారు. ఇంట్లో కావాల్సిన సరుకులు, కూరగాయల దగ్గర నుంచి బట్టలు, షూలు ఇలా ఏది కావాలన్న ఇంట్లో కూర్చొనే ఆన్ లైన్‌లో ఆర్డర్ చేస్తున్నారు. అయితే కొందరు సైబర్ నేరగాళ్లు ఇదే అదునుగా మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకుల్ని టార్గెట్ చేసి వారిని నమ్మించి అకౌంట్లలో ఉన్న నగదును ఈజీగా కొట్టేస్తున్నారు. తాజాగా ఓ పోలీస్ అధికారి భార్యకు సైతం ఇదే అనుభవం ఎదురయ్యింది.

ఆన్ లైన్‌లో చీర కొన్న ఆమెను సైబర్ నేరగాళ్లు ఈజీగా తమ ట్రాప్‌లో పడేసి లక్ష రూపాయలు మాయం చేశారు. హైదరాబాద్ నారాయణగూడ పోలీస్ స్టేషన్‌ సీఐ సతీమణి ఆన్లైన్ సేల్స్ సంస్థ నుంచి ఒక డిజైన్ చీర ఎంపిక చేసుకుంది. దానిని ఆర్డర్ కూడా చేశారు. అయితే తాను ఎంచుకున్న చీర ఒకటయితే.. మరో డిజైన్ చీరను ఆమెకు డెలివరీ చేశారు. దీంతో ఆమె గూగుల్ సెర్చ్ లో సంస్థ కస్టమర్ కేర్ నెంబర్ అనుకొని సైబర్ నేరగాళ్ల నెంబర్‌కు ఫోన్ చేసింది.

దీంతో ఆమె సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కింది. ఇదే అదునుగా అవకాశంగా తీసుకున్న కేటుగాళ్లు వెంటనే అప్రమత్తమై తాము సంస్థ ప్రతినిధులమని డబ్బులు రిటర్న్ చేస్తామని చెప్పి ఆమె బ్యాంక్ ఖాతా వివరాలు అడిగారు. అది నిజమని నమ్మిన ఆమె బ్యాంకుకు సంబంధించిన వివరాలన్ని టకా టకా చెప్పేసింది. ఇంకేముంది వెంటనే ఆమె అకౌంట్లో ఉన్న లక్షకు పైగా నగదు తమ ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. డబ్బులు డెబిట్ అయినట్లు ఆమె ఫోన్ కు బ్యాంకు నుండి మెసేజ్ రావడంతో షాక్ అయ్యింది.

దీంతో సైబర్ క్రైమ్ పోలీసులకు సీఐ సతీమణి ఫిర్యాదు చెసింది. ఆలస్యంగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. తమ బ్యాంక్ ఖాతా వివరాలు ఎవరికి చెప్పకూడదని పోలీసులు పదే పదే చెబుతున్న జనం మాత్రం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి తమ నగదును పోగొట్టుకుంటున్నారు. ఆన్ లైన్‌లో కనిపించే కస్టమర్ కేర్ నెంబర్ల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు.

Untitled Document
Advertisements