హైకోర్టు ఆదేశాలతో పీఠమెక్కిన అశోక్ గజపతిరాజు

     Written by : smtv Desk | Thu, Jun 17, 2021, 04:48 PM

హైకోర్టు ఆదేశాలతో పీఠమెక్కిన అశోక్ గజపతిరాజు

ఏపీ హైకోర్టు తీర్పుతో మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ట్రస్ట్ చైర్ పర్సన్‌గా ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయిత గజపతి రాజు నియామకం చెల్లదని.. ఆమెను చైర్ పర్సన్‌గా నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను కోర్టు కొట్టేసింది. టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజును ట్రస్ట్ చైర్మన్‌గా పునర్నియమించాలని ఆదేశాలు జారీ చేయడంతో ఆ రోజు ఆయన ట్రస్ట్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.

మాన్సాస్ చైర్మన్‌గా సంతకం చేసిన అనంతరం అశోక్ గజపతి రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాన్సాస్‌లో దోపిడీదారులకు స్థానం లేదంటూ హాట్ కామెంట్స్ చేశారు. ట్రస్ట్ చైర్మన్‌గా విద్యకే తమ తొలి ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు. అందుకోసం ప్రభుత్వ సాయం కూడా అర్థిస్తామని ఆయన అన్నారు. ఇప్పటి వరకూ మాన్సాస్‌లో ఆడిట్ జరగలేదని తెలిసి ఆశ్చర్యపోయానని అశోక్ గజపతి రాజు అన్నారు. ఆడిట్ బాధ్యత ప్రభుత్వానిదేనని.. ఇప్పటికే ఆడిట్‌కి సంబంధించిన ఫీజు కూడా చెల్లించినట్లు చెప్పారు.

సింహాచలం సమీపంలని పంచ గ్రామాల సమస్యపై దృష్టి సారిస్తామని అశోక్ తెలిపారు. రామతీర్థం క్షేత్రంలో దుండగులు రాముని శిరస్సు తొలగించి తీసుకెళ్లారని.. ఇప్పటి వరకూ నిందితులను పట్టుకోలేదని ఆయన అన్నారు. ఆలయం కోసం విరాళం ఇచ్చినా తిప్పి పంపారని.. ఆ విరాళాన్ని అయోధ్య రామమందిరానికి పంపినట్లు చెప్పారు. సిహాచలం దేవస్థాన ఈవో తనను కలవడానికి కూడా ఇష్టపడలేదని అసహనం వ్యక్తం చేశారు. నిన్న సింహాచలం దేవస్థానానికి వెళ్లిన అశోక్ గజపతి రాజుకి ఆలయ మర్యాదలతో స్వాగతం పలకకపోవడం విమర్శలకు దారితీసింది.





Untitled Document
Advertisements