వార్మప్‌ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సెంచరీ

     Written by : smtv Desk | Wed, Jul 21, 2021, 02:03 PM

వార్మప్‌ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సెంచరీ

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ముంగిట టీమిండియాకి కొత్త తలనొప్పి మొదలైంది. కంట్రీ సెలెక్ట్ ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్‌ మ్యాచ్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్ (101 రిటైర్డ్ ఔట్: 150 బంతుల్లో 11x4, 1x6) సెంచరీతో చెలరేగాడు. దాంతో.. మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 306/9తో నిలిచింది. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానె ఈ మ్యాచ్‌కి దూరంగా ఉన్నారు. దాంతో.. రోహిత్ శర్మ కెప్టెన్‌గా భారత్ జట్టుని నడిపిస్తున్నాడు. యువ ఓపెనర్ శుభమన్ గిల్ గాయపడటంతో.. అతని స్థానంలో మయాంక్ అగర్వాల్‌ని ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో ఆడించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ ఆశించింది. కానీ.. ఈ వార్మప్ మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ (28: 35 బంతుల్లో 6x4) తేలిపోగా.. ఐదో స్థానంలో ఆడిన కేఎల్ రాహుల్ సెంచరీ‌తో ఫామ్ అందుకున్నాడు. అలానే రవీంద్ర జడేజా (75: 146 బంతుల్లో 5x4, 1x6) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కానీ.. కెప్టెన్ రోహిత్ శర్మ (9), చతేశ్వర్ పుజారా (21), హనుమ విహారి (24)తో పాటు శార్ధూల్ ఠాకూర్ (20), అక్షర్ పటేల్ (0) ఫెయిలయ్యారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి క్రీజులో జస్‌ప్రీత్ బుమ్రా (3 బ్యాటింగ్), మహ్మద్ సిరాజ్ (1 బ్యాటింగ్) ఉన్నారు. ఓపెనర్ రేసులో మయాంక్‌తో పాటు కేఎల్ రాహుల్ కూడా ఉన్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా కంట్రీ సెలెక్ట్ ఎలెవన్ టీమ్‌లో ఆటగాళ్లు తగ్గడంతో.. భారత్ జట్టులోని ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, ఫాస్ట్ బౌలర్ అవేష్ ఖాన్ ఆ టీమ్‌కి ఆడారు. కానీ సుందర్‌కి బౌలింగ్ వేసే అవకాశం దక్కలేదు. అవేష్ ఖాన్ 9.5 ఓవర్లు వేసినా కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు.






Untitled Document
Advertisements