ఫాస్ట్ బౌలర్ అవేష్ ఖాన్ కు గాయం

     Written by : smtv Desk | Thu, Jul 22, 2021, 12:08 PM

ఫాస్ట్ బౌలర్ అవేష్ ఖాన్ కు గాయం

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ముంగిట భారత్ జట్టులో రెండో క్రికెటర్ గాయపడ్డాడు. ఇటీవల యువ ఓపెనర్ శుభమన్ గిల్‌కి గాయమవగా.. అతను ఇంగ్లాండ్ గడ్డపై నుంచి భారత్‌కి వచ్చేశాడు. తాజాగా భారత్ జట్టులోకి స్టాండ్ బై ఆటగాడిగా ఎంపికై అక్కడికి వెళ్లిన ఫాస్ట్ బౌలర్ అవేష్ ఖాన్ కూడా గాయపడ్డాడు. దాంతో.. అతను కూడా త్వరలోనే స్వదేశానికి వచ్చేయనున్నాడు. భారత్, ఇంగ్లాండ్ మధ్య ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 వరకూ ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. ఇంగ్లాండ్‌తో సిరీస్ ముంగిట డర్హామ్‌లో కౌంటీ ఎలెవన్ టీమ్‌తో భారత్ జట్టు మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌ ఆడుతోంది. కరోనా కారణంగా కౌంటీ ఎలెవన్ టీమ్‌లో ఇద్దరు ఆటగాళ్లు లేకపోవడంతో.. భారత క్రికెటర్లు వాషింగ్టన్ సుందర్, అవేష్ ఖాన్ ఆ టీమ్‌కి ఆడారు. ఈ క్రమంలో అవేష్ ఖాన్ గాయపడ్డాడు. బంతిని నిలువరించే క్రమంలో అవేష్ ఖాన్ చేతి వేలికి గాయమవగా.. పగులు వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. దాంతో.. కనీసం నెల రోజులు అతను బౌలింగ్‌కి దూరంగా ఉండాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున నిలకడగా రాణించిన అవేష్ ఖాన్.. మహేంద్రసింగ్ ధోనీ వికెట్ పడగొట్టి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఈ 24 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ ఇప్పటికే 26 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లాడి 100 వికెట్లు పడగొట్టడం విశేషం. దాంతో.. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లోనూ అతనికి ఛాన్స్ దక్కే సూచనలు కనిపించాయి.





Untitled Document
Advertisements