"ధోనీ కంటే ముందే క్రికెట్‌లోకి ఎంట్రీ...కానీ...!"

     Written by : smtv Desk | Thu, Jul 22, 2021, 04:16 PM


మహేంద్రసింగ్ ధోనీ రాకతో భారత క్రికెట్‌లోని చాలా మంది వికెట్ కీపర్లు కొన్నాళ్లపాటు కనుమరుగైపోయారు. అందులో పార్థీవ్ పటేల్, దినేశ్ కార్తీక్‌ ముందు వరుసలో ఉండగా.. రాబిన్ ఉతప్ప, సాహా కూడా ధోనీ బాధితులే. టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన మూడేళ్లలోనే కెప్టెన్‌ ఎదిగిన ధోనీ దెబ్బకి.. మూడు ఫార్మాట్లలోనూ దాదాపు దశాబ్దకాలం మరే వికెట్ కీపర్ కూడా రేసులో కనిపించలేదు. ధోనీ క్రికెట్ ఆడే రోజుల్లో కీపర్లుగా ఉండటం మీ దురదృష్టంగా ఎప్పుడైనా భావించారా..? అని పార్థీవ్ పటేల్‌ని ప్రశ్నించగా అతను సమాధానమిచ్చాడు.

‘‘నిజాయతీగా చెప్పాలంటే నేను ఎప్పుడూ అలా ఆలోచించలేదు. భారత్ జట్టుకి ధోనీ కంటే ముందే నేను ఆడాను. కానీ.. ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చలేకపోయా. దాంతో.. నాపై వేటు పడింది. ఆ తర్వాత మహేంద్రసింగ్ ధోనీ వచ్చాడు. దీన్ని నేను దురదృష్టంగా ఎప్పుడూ భావించలేదు. వేటు పడే సమయానికే నేను 19 టెస్టు మ్యాచ్‌లు ఆడాను. కాబట్టి.. నాకు తగినన్ని అవకాశాలు లభించలేదు అనే మాట కూడా సబబు కాదు. నేనే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలేకపోయా’’ అని పార్థీవ్ పటేల్ చెప్పుకొచ్చాడు.

2004లో పార్థీవ్ పటేల్‌పై మొదటిసారి వేటు పడగా.. 2008, 2016లో మళ్లీ టెస్టుల్లో అవకాశం లభించింది. కానీ.. ఈ ఓపెనర్ వినియోగించుకోలేకపోయాడు. 2014లో టెస్టులకి ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకీ గత ఏడాది రిటైర్మెంట్ ప్రకటించిన పార్థీవ్ పటేల్.. ప్రస్తుతం ముంబయి ఇండియన్స్ టీమ్‌కి బ్యాక్‌రూమ్ స్టాఫ్‌గా పనిచేస్తున్నాడు.





Untitled Document
Advertisements