శ్రీ కృష్ణుడు జరాసంధుడిని ఎలా వధించాడు?

     Written by : smtv Desk | Fri, Jul 23, 2021, 12:52 PM

శ్రీ కృష్ణుడు జరాసంధుడిని ఎలా వధించాడు?

జరాసంధుడు మగధదేశపు రాజు. గిరిప్రజపురము ఇతని రాజధాని. బృహద్రధుని కుమారుడు. బృహద్రధునికి ఇద్దరు భార్యలు. సంతానం లేక చండకౌశికుడు అనే ఋషికి నమస్కరించి తన వ్యధ చెప్పుకొనగా ఆ ఋషి ఫలం ఇచ్చి అతని భార్యలచే తినిపించమని చెప్పాడు. అతడా ఫలమును రెండు భాగములు చేసి భార్యలతో తినిపించగా వారు గర్భం దాల్చి రెండు అర్ధ శిశువులకు జన్మనిచ్చారు. ఓ కన్ను, ఓ కాలు, ఓ చెయ్యి అలా రెండు సమాన భాగములైన శిశువు ఖండములను చూసి వారు భయపడి బయట పారవేస్తారు. ఈ శిశు ఖండములను ఆ నగర రక్షక జరా అను రాక్షసి సంగ్రహించి భుజించుటకు దగ్గరకు చేర్చగానే రెండు భాగాలు ఒకటిగా రూపొంది ఆ బిడ్డకు ప్రాణం రాగా ఆ రాక్షసి కంగారుపడి మానవ స్త్రీగా మారి ఆ బాలుడ్ని బృహద్రధునికి అప్పగించింది. జరవల్ల ఈ రూపము పొందుట వలన జరాసంధుడను నామం వచ్చింది. ఇతడత్యంత పరాక్రమశాలి. ఎందరో రాజులను ఓడించి బంధించాడు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు అస్తీ, ప్రాస్తులను కంసునికి ఇచ్చి వివాహము చేశాడు. శ్రీ కృష్ణుడు కంసుని వధించినప్పటి నుండి అతనిపై వైరము పెంచుకొని 18 సార్లు దండెత్తాడు. ఇతడు ఆయుధములతో మరణము లేకుండునట్లు వరము పొందాడు. ధర్మరాజు సూయ యాగం చేయు సందర్భమున శ్రీ కృష్ణ భీమార్జునులు బ్రాహ్మణ వేషమున మగధలో జరాసంధుని వద్దకు రాగా బ్రాహ్మణులన్న విపరీత గౌరవమున్న జరాసంధుడు వీరి కోరిక తెలుపమని కోరగా మాలో ఒకరుతో మల్ల యుద్దము చేయమని కోరారు. జరాసంధుడు తన కుమారునికి రాజ్యభారం అప్పగించి భీమునితో 14 రోజులు పోరాడి మరణించాడు.





Untitled Document
Advertisements