TRSలోకి మోత్కుపల్లి!

     Written by : smtv Desk | Fri, Jul 23, 2021, 01:01 PM

TRSలోకి మోత్కుపల్లి!

తెలంగాణ సీనియర్ రాజకీయ నేత మోత్కుపల్లి నర్సింహులు బీజేపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు పంపానని చెప్పారు. టీఆర్ఎస్ లో చేరబోతున్నట్టు ఆయన ప్రకటించారు. ఈటల రాజేందర్ ను పార్టీలో చేర్చుకోబోతున్నట్టు రాష్ట్ర బీజేపీ నేతలు తనతో ఒక్కమాట కూడా చెప్పలేదని మండిపడ్డారు. ఈటలను పార్టీలో చేర్చుకోవడం తనను బాధించిందని అన్నారు.

అసలు రాజేందర్ ను నెత్తిన మోయాల్సిన అవసరం బీజేపీకి ఎందుకొచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఈటల ఒక అవినీతిపరుడని వ్యాఖ్యానించారు. దళితుల భూములను ఈటల ఆక్రమించుకున్నారని మోత్కుపల్లి ఆరోపించారు. వేల కోట్ల రూపాయలను ఈటల కూడబెట్టారని అన్నారు. ఈటలకు ఇంత ఆస్తి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. హుజూరాబాద్ లో ఈటలను ఓడించేందుకు దళితులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

తనకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని బీజేపీ ఉపయోగించుకోలేదని మోత్కుపల్లి మండిపడ్డారు. కనీసం బీజేపీ కేంద్ర కమిటీలో ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా కూడా అవకాశం ఇవ్వలేదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన దళిత సాధికారత సమావేశంలో తన అభిప్రాయాలను చెప్పాలని ఆహ్వానించారని... బండి సంజయ్ కు చెప్పే తాను ఆ సమావేశానికి వెళ్లానని.. అయినా పార్టీలో వ్యతిరేక అభిప్రాయాలు రావడం తనను వేధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ తీసుకొచ్చిన ఒక పథకాన్ని తాను ప్రశంసించడం బీజేపీ నేతలకు మింగుడుపడలేదని అన్నారు.





Untitled Document
Advertisements