అట్టహాసంగా టోక్యో ఒలింపిక్స్ స్టార్ట్...భారత బృందాన్ని నడిపించిన మేరీకోమ్, మన్‌ప్రీత్

     Written by : smtv Desk | Fri, Jul 23, 2021, 07:01 PM

అట్టహాసంగా టోక్యో ఒలింపిక్స్ స్టార్ట్...భారత బృందాన్ని నడిపించిన మేరీకోమ్, మన్‌ప్రీత్

జపాన్‌లోని టోక్యోలో అట్టహాసంగా శుక్రవారం సాయంత్రం ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కేవలం 1000 మంది అతిథుల సమక్షంలో జరిగిన ఈ ప్రారంభోత్సవంలో భారత బృందాన్ని దిగ్గజ బాక్సర్ మేరీకోమ్, పురుషుల హాకీ టీమ్ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ నడిపించారు. త్రివర్ణ పతాకాన్ని చేతబూని ఈ ఇద్దరూ ముందు నడుస్తుంటే.. 20 మంది భారత అథ్లెట్లు, ఆరుగురు ప్రతినిధులు వారి వెనుక అభివాదం చేస్తూ నడిచారు.

భారత్ నుంచి 119 మంది క్రీడాకారులు టోక్యో‌కి వెళ్లారు. ఇందులో 67 మంది ఫురుషులు, 52 మంది మహిళా క్రీడాకారులు ఉన్నారు. ఈరోజు నుంచి ఆగస్టు 8 వరకూ టోక్యో ఒలింపిక్స్ జరగనున్నాయి. టోక్యో ఒలింపిక్స్‌లో సత్తాచాటే అథ్లెట్లకి భారత ఒలింపిక్ సంఘం నగదు పురస్కారాలని ప్రకటించేసింది. స్వర్ణం గెలిస్తే రూ.75 లక్షలు, రజతానికి రూ.40 లక్షలు, కాంస్యానికి రూ.25 లక్షలు చొప్పున అథ్లెట్లకి ఇవ్వనున్నట్లు తెలిపింది. అలానే టోక్యోలో ఉన్న అథ్లెట్లకి రోజువారి భత్యం కింద రూ.3,723 ఇవ్వనున్నారు.

వాస్తవానికి గత ఒలింపిక్స్ వరకూ పతాకధారిగా ఒకరికే అవకాశం లభించేది. కానీ.. ఈ సారి పురుషుల నుంచి ఒకరికి, మహిళల నుంచి ఒకరికి ఈ ఛాన్స్ లభించింది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే..? కిందటిసారి జరిగిన ఒలింపిక్స్‌‌లో పతకం గెలిచిన అథ్లెట్‌కి పతాకధారిగా ఛాన్స్ లభించేది. దాంతో.. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన పీవీ సింధుకి అవకాశం దక్కుతుందని అంతా ఊహించారు. కానీ.. ఐఓఏ మాత్రం అనూహ్యరీతిలో మేరీకోమ్, మన్‌ప్రీత్‌లను పతాకధారులుగా ఎంపిక చేసింది. ఇక ముగింపు వేడుకల్లో రెజ్లర్ బజరంగ్ పునియా పతాకధారిగా వ్యవహరించనున్నాడు.





Untitled Document
Advertisements