టోక్యో ఒలింపిక్స్...భారత్‌కి మొదటిరోజు నిరాశాజనక ఫలితాలు

     Written by : smtv Desk | Fri, Jul 23, 2021, 07:03 PM

టోక్యో ఒలింపిక్స్...భారత్‌కి మొదటిరోజు నిరాశాజనక ఫలితాలు

జపాన్‌లోని టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత ఆర్చర్ల జర్నీ మొదలైంది. వరల్డ్‌ నెం.1గా ఉన్న దీపికా కుమారి ఆర్చరీ మహిళల వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్లో పోటీపడగా.. పురుషుల వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్స్‌లో అతాను దాస్ పోటీపడ్డాడు. కానీ.. ఈ పోటీలో కాస్త తడబడిన దీపికా కుమారి 9వ స్థానంలో నిలిచింది. దీపికా 663 పాయింట్లతో నిలవగా.. ఆమె ప్రధాన ప్రత్యర్థిగా కనిపిస్తున్న ఆన్‌సాన్ 680 పాయింట్లతో ఒలింపిక్స్ రికార్డు నమోదు చేసింది. 2019లో టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్ అర్హత పోటీల్లోనూ దీపికా కుమారిని ఆన్‌సాన్ ఓడించింది.

పురుషుల వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్స్‌లో అతాను దాస్ నిరాశపరిచాడు. తరుణ్‌దీప్, జాదవ్ ప్రవీణ్‌తో కలిసి ఈరోజు పోటీపడిన అతాను దాస్ అంచనాల్ని అందుకోలేకపోయాడు. ర్యాంకింగ్ రౌండ్స్ ముగిసే సమయానికి జాదవ్ ప్రవీణ్ 31వ ర్యాంక్‌లో నిలవగా.. అతాను దాస్ 35వ స్థానంలో నిలిచాడు. తరుణ్‌దీప్‌కి 37వ స్థానం దక్కింది. దక్షిణ కొరియాకి చెందిన జే డీక్ కిమ్ 668 పాయింట్లతో టాప్‌లో నిలవగా.. జాదవ్ ప్రవీణ్ 656, అతాను దాస్ 653, తరుణ్‌దీప్ 652 పాయింట్లతో నిలిచారు.





Untitled Document
Advertisements