ప్రమాదంలో పూర్తిగా కోల్పోయిన చేతులు 23 ఏళ్ల తర్వాత సర్జరీతో అతికించారు

     Written by : smtv Desk | Fri, Jul 23, 2021, 08:12 PM

ప్రమాదంలో పూర్తిగా కోల్పోయిన చేతులు 23 ఏళ్ల తర్వాత సర్జరీతో అతికించారు

ఐస్‌లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రమాదంలో పూర్తిగా రెండు చేతులను కోల్పోయాడు . సర్జరీ ద్వారా ఓ దాత చేతులను విజయవంతంగా అమర్చి ఔరా అనిపించారు. కోపవోగుర్‌లో నివసిస్తున్న 49 ఏళ్ల ఫెలిక్స్ గ్రెటార్సన్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. 1998లో ఓ పవర్ లైన్ మీద పనిచేస్తున్న సమయంలో అకస్మా్త్తుగా విద్యుద్ఘాతానికి గురయ్యాడు. దీంతో అతడి రెండు చేతులు కాలిపోయాయి. ఈ ప్రమాదం తర్వాత ఫెలిక్స్ సుమారు మూడు నెలలు కోమాలోకి జారుకున్నాడు. డాక్టర్లు అతడికి 54 సార్లు సర్జరీలు జరిపినా ఫలితం లేకపోయింది. గాయాలు చాలా తీవ్రంగా ఉండటంతో.. అతడి ప్రాణాలు కాపాడేందుకు రెండు చేతులు తొలగించారు. 2007లో ఫెలిక్స్ టీవీలో ఓ ప్రకటన చూశాడు. ఐస్‌ల్యాండ్‌కు చెందిన ప్రముఖ డాక్టర్ జీన్ మైఖెల్ డ్యుబెర్నార్డ్ 1998లో విజయవంతంగా ఓ వ్యక్తికి మరోకరి చేతులను అమర్చినట్లు తెలిపారు. దీంతో ఫెలిక్స్‌లో ఆశలు చిగురించాయి. అయితే, ఆ సర్జరీ కోసం ఫ్రాన్స్ వెళ్లాల్సి వస్తుందని తెలిసి కాస్త సంకోచించాడు. అయితే, తన సమస్యను వివరిస్తూ వైద్యుడికి దరఖాస్తు చేసుకున్నాడు. నాలుగేళ్ల తర్వాత సర్జన్ జీన్ అతడికి ఆపరేషన్ చేయడానికి అంగీకరించాడు. దీంతో ఫెలిక్స్ ఫండ్ రైజింగ్ ద్వారా ఆపరేషన్‌కు అవసరమైన నిధులను సమకూర్చాడు. ఆ సొమ్ముతో ఈ ఏడాది జనవరి 12న రెండు చేతులకు సర్జరీ నిర్వహించారు. సుమారు 15 గంటల సేపు జరిగిన ఈ సర్జరీలో దాత డొనేట్ చేసిన చేతులను ఫెలిక్స్ భుజాలకు అమర్చారు. ఆ తర్వాత వైద్యులు వందలాది గంటలు అతడితో అనేక రకాల వ్యాయామాలు చేయించారు. ఫలితంగా అతడు ఆ చేతులను కదపగలిగాడు. ఇప్పుడు అతడు ‘కొత్త’ చేతులతో తన భార్య, పిల్లలను, మనవళ్లను అప్యాయంగా హత్తుకొనే రోజు కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం ఫెలిక్స్ చేతికి పూర్తిగా స్పర్శను పొందలేకపోతున్నాడు. అతడి చేతిలోని నరాలు రోజుకు మిల్లీమీటర చొప్పున పెరుగుతాయని, ఏడాదిలో అవి అతడి మోచేతి వరకు చేరతాయని డాక్టర్లు తెలిపారు. ఆ తర్వాత అతడు అన్ని రకాల స్పర్శలను పొందగలడని పేర్కొన్నారు.





Untitled Document
Advertisements