వంట గ్యాస్ లీక్...సిలిండర్ పేలి ఏడుగురి సజీవదహనం

     Written by : smtv Desk | Sat, Jul 24, 2021, 03:12 PM

వంట గ్యాస్ లీక్...సిలిండర్ పేలి ఏడుగురి సజీవదహనం

కుటుంబసభ్యులందరూ గాఢ నిద్రలో వంట గ్యాస్ లీకైంది. గదంతా గ్యాస్ పరుచుకుంది. పొరుగింటి వారికి గ్యాస్ వాసన రావడంతో అలర్ట్ చేయడానికి ఆ ఇంటి తలుపు తట్టారు. నిద్ర లేచిన యజమాని లైట్ ఆన్ చేశాడు. ఇక అంతే.. ఘోర విషాదం. ఒక్కసారిగా మంటలు చెలరేగి 10 మంది మంటల్లో చిక్కుకున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఏడుగురు దర్మరణం పాలయ్యారు. స్థానికంగా ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కూలీలు తమ కుటుంబ సభ్యులతో అహ్మదాబాద్ శివార్లలోని ఓ గదిలో నివసిస్తున్నారు. గురువారం రాత్రి వారు గాఢ నిద్రలో ఉన్న సమయంలో వంట గ్యాస్ లీక్ అయ్యింది. ఆ గది నుంచి గ్యాస్ వాసన వస్తుండటాన్ని గుర్తించిన పొరుగింటి వారు.. వారిని అప్రమత్తం చేయడానికి ఆ ఇంటి తలుపు తట్టారు. నిద్ర నుంచి మేల్కోన్న ఓ వ్యక్తి వెంటనే లైట్ ఆన్ చేశాడు. లీకైన గ్యాస్ అప్పటికే గదంతా పరుచుకోవడంతో.. లైట్ ఆన్ చేయగానే గదిలో మంటలు వ్యాపించాయి. ఆ మంటలకు సిలిండర్ కూడా పేలిపోయింది.

ఘటనా సమయంలో ఆ గదిలో పది మంది నిద్రిస్తున్నారు. ప్రమాదం జరగగానే మంటల్లో కాలుతూ ఒక్కొక్కరూ గది బయటకు పరుగెత్తుకొచ్చారు. స్థానికులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అదే రాత్రి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో నలుగురు వ్యక్తులు శుక్రవారం మృతి చెందారు. మృతి చెందిన వారిలో పురుషులతో పాటు మహిళలు, చిన్నారులు ఉన్నారు.

మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులందరూ మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లా మధుసూదన్‌గర్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన పట్ల మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి 4 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు చికిత్స కోసం మరో 2 లక్షల రూపాయలు విడుదల చేశారు.





Untitled Document
Advertisements