బ్రెయిన్ సర్జరీ సమయంలో హనుమాన్‌ చాలీసా పారాయణం

     Written by : smtv Desk | Sat, Jul 24, 2021, 03:18 PM

బ్రెయిన్ సర్జరీ సమయంలో హనుమాన్‌ చాలీసా పారాయణం

ఓ మహిళ బ్రెయిన్ సర్జరీ జరుగుతున్న సమయంలో హనుమాన్‌ చాలీసా పారాయణ చేసి వార్తల్లో నిలిచింది. అంతేకాదు, ఆమె మధ్యలో తప్పు పలికితే ఆపరేషన్‌ చేస్తున్న వైద్యుడొకరు సహకరించడం విశేషం. ‘క్రేనియోటమీ’ విధానం ద్వారా ఆమెకు కేవలం కణతి ఉన్న ప్రాంతంలోనే మత్తు ఇచ్చి ఆపరేషన్‌ చేసినట్టు ఎయిమ్స్ వైద్యులు పేర్కొన్నారు. ఆమె మెదడుకు ఎడమ వైపున కణతిని శస్త్ర చికిత్స ద్వారా తొలగించారు. అనంతరం తనకు ఏమీ జరగనట్లు తల.. అటూ ఇటూ ఊపుతూ ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి ఆ మహిళ బయటకొచ్చారు. శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలో అక్కడున్న వైద్య సిబ్బంది ఒకరు ఈ దృశ్యాలను ఫోన్‌‌లో రికార్డు చేసి.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

ఎయిమ్స్ న్యూరోసర్జరీ విభాగం వైద్యుడు డాక్టర్ దీపక్ గుప్తా మాట్లాడుతూ.. ఓ 24 ఏళ్ల మహిళకు మెదడులో కణిత ఏర్పడిందని, శస్త్రచికిత్స ద్వారా దానిని తొలగించామని అన్నారు. మూడు గంటల పాటు జరిగిన సుదీర్ఘ ఈ ఆపరేషన్‌‌లో మహిళ మెలకువతోనే ఉందన్నారు. ఆమెకు తలపై మాడు భాగంలోనే అనెస్తీషియా, ఇచ్చి, నొప్పి నివారణ ఔషధం ఇచ్చామన్నారు. శస్త్రచికిత్స విజయవంతమయ్యిందని, ప్రస్తుతం పర్యవేక్షణలో ఉన్న ఆమెను శనివారం డిశ్చార్జ్ చేయనున్నట్టు డాక్టర్ దీపక్ తెలిపారు.

కాగా, గత 20 ఏళ్లలో ఎయిమ్స్ వైద్యులు క్రేనియోటమీ విధానంలో 500పైగా శస్త్రచికిత్స చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. డిసెంబరు 2018లో జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ ఆస్పత్రి కూడా ఇదే విధమైన శస్త్రచికిత్సను నిర్వహించింది. అలాగే, గిటార్ వాయిస్తుండగా ఓ వ్యక్తికి బెంగళూరు వైద్యులు బ్రెయిన్ సర్జరీ విజయవంతంగా చేశారు.





Untitled Document
Advertisements