మిడిలార్డర్ రేసులో మనీశ్ పాండే చాలా వెనకబడిపోయాడు "... సెహ్వాగ్

     Written by : smtv Desk | Sat, Jul 24, 2021, 07:09 PM

మిడిలార్డర్ రేసులో మనీశ్ పాండే చాలా వెనకబడిపోయాడు

శ్రీలంక గడ్డపై పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన మనీశ్ పాండేపై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. లంకతో జరిగిన మూడు వన్డేల్లోనూ అవకాశం దక్కించుకున్న మనీశ్ పాండే.. కనీసం ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. అతను క్రీజులోకి వెళ్లే సమయానికి మూడు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా మెరుగైన స్థితిలో కనిపించింది. అయినప్పటికీ.. స్వేచ్ఛగా ఆడలేకపోయిన మనీశ్ పాండే.. పేలవరీతిలో వికెట్ చేజార్చుకున్నాడు. దాంతో.. ఇకపై నీకు పెద్దగా అవకాశాలు రాకపోవచ్చని వీరేంద్ర సెహ్వాగ్ పరోక్షంగా హెచ్చరించాడు. ఫస్ట్ వన్డేలో 40 బంతులాడిన మనీశ్ పాండే 26 పరుగులకే ఔటవగా.. సెకండ్ వన్డేలో 31 బంతులాడి 37 పరుగుల వద్ద రనౌటయ్యాడు. ఆ తర్వాత శుక్రవారం ముగిసిన మూడో వన్డేలోనూ 11 పరుగులకే మనీశ్ పాండే వికెట్ చేజార్చుకున్నాడు. మరోవైపు ఈ సిరీస్‌తోనే వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలతో చెలరేగిపోగా.. ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ సైతం అర్ధశతకంతో సత్తాచాటాడు. భారత్, శ్రీలంక మధ్య ఆదివారం నుంచి కొలంబో వేదికగా మూడు టీ20ల సిరీస్ ప్రారంభంకానుంది.

‘‘శ్రీలంకతో వన్డే సిరీస్‌లో ఎక్కువ లబ్ధి పొందిన ఆటగాడు మనీశ్ పాండే. అతను మూడు మ్యాచ్‌ల్లోనూ అవకాశం దక్కించుకున్నాడు.. అన్నింటిలోనూ బ్యాటింగ్ చేసే ఛాన్స్ లభించింది. కానీ.. తేలిపోయాడు. పర్సనల్‌గా అతని ప్రదర్శనపై నేను కూడా చాలా నిరాశకి గురయ్యా. బహుశా నాకు తెలిసి.. ఇకపై వన్డేల్లో అతనికి పెద్దగా అవకాశాలు దక్కకపోవచ్చు. సిరీస్‌లో తక్కువ స్కోర్లకే ఔటవడం ద్వారా మనీశ్ పాండే వెనకబడిపోయాడు. ఇప్పుడు మిడిలార్డర్ రేసులో అతని కంటే ముందు వరుసలో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ఉన్నారు. ఇకపై మెరుగైన ప్రదర్శన కనబరిస్తే తప్ప.. కెరీర్‌ కష్టమే’’ అని సెహ్వాగ్ హెచ్చరించాడు.





Untitled Document
Advertisements