టోక్యో ఒలింపిక్స్‌లో ప్రీక్వార్టర్స్‌లోకి మేరీకోమ్ ఎంట్రీ

     Written by : smtv Desk | Sun, Jul 25, 2021, 03:13 PM

టోక్యో ఒలింపిక్స్‌లో ప్రీక్వార్టర్స్‌లోకి మేరీకోమ్ ఎంట్రీ

భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ టోక్యో ఒలింపిక్స్‌లో బోణి కొట్టింది. మహిళల 51 కేజీల విభాగంలో ఆదివారం మధ్యాహ్నం పోటీపడిన మేరీకోమ్.. డొమినిక్ రిపబ్లిక్ బాక్సర్ మిగులినా హర్నాండేజ్‌ గ్రేషియాని 4-1 తేడాతో చిత్తుగా ఓడించేసింది. ఈ క్రమంలో ప్రీక్వార్టర్స్‌లోకి మేరీకోమ్ అడుగుపెట్టింది.

రౌండ్-1లో పంచ్‌ల వర్షం కురిపించిన మేరీకోమ్.. ప్రత్యర్థి గ్రేషియాని కుదురుకోనివ్వలేదు. ఈ క్రమంలో 3-2తో ఫస్ట్ రౌండ్‌ని గెలిచిన ఈ భారత దిగ్గజ బాక్సర్.. రౌండ్-2లోనూ అదే తరహా ఆధిపత్యం చెలాయించి 3-2తో విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తంగా ఉమెన్స్‌ ప్లై‌వెయిట్ (48-51కేజీల) విభాగంలో రౌండ్ ఆఫ్ 32 నుంచి ప్రీక్వార్టర్స్ (రౌండ్ ఆఫ్ 16)లోకి అడుగుపెట్టిన మేరీకోమ్.. ఇదే జోరుని కొనసాగిస్తే భారత్‌కి పతకం ఖాయంగా కనిపిస్తోంది.

టోక్యో ఒలింపిక్స్‌లో మొత్తం 9 మంది భారత బాక్సర్లు బరిలోకి ఉన్నారు. ఒలింపిక్స్‌కి అర్హత పొందిన తర్వాత మేరీకోమ్‌తో పాటు బాక్సర్లందరూ ఇటలీకి వెళ్లి శిక్షణ తీసుకున్నారు. టోక్యోకి కూడా అక్కడి నుంచే మేరీకోమ్ వెళ్లడం విశేషం. ఈ ఒలింపిక్స్‌లో పతకం గెలవడం ద్వారా ఘనంగా కెరీర్‌కి వీడ్కోలు పలకాలని మేరీకోమ్ ఆశిస్తోంది. మేరీకోమ్ ఇప్పటికే ఆరుసార్లు వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements