త్రిపురాసురుల వధ!

     Written by : smtv Desk | Mon, Jul 26, 2021, 11:32 AM

త్రిపురాసురుల వధ!

తారకాసురుని కుమారులైన కమలాక్షుడు, తారకాక్షుడు, విధ్యున్మాలినులను త్రిపురాసురులు అని పిలుస్తారు. మయుడు నిర్మించిన అద్భుత భవనం త్రిపురం. అదితి,దితి ఇద్దరూ దక్ష ప్రజాపతి కుమార్తెలే. వీరిద్దరిని కశ్యపుడు వివాహమాడాడు. కశ్యపుని ఇద్దరు భార్యలలో అదితికి దేవతలు, దితికి దానవులు జన్మించారు. దేవదానవుల మధ్య ఎల్లప్పుడూ యుద్దాలు జరిగేవి. అమృతం సేవించిన దేవతలదే ఎప్పుడు గెలుపు. సుబ్రహ్మణ్యుడు తారకాసురున్ని వధించడంతో దానవులు మరింత బలహీనులయ్యారు. తారకాసురుని కుమారులైన కమలాక్షుడు, తారకాక్షుడు, విధ్యున్మాలి బ్రహ్మను గూర్చి ఘోర తపమాచరించగా అతడు ప్రత్యక్షమై వరం కోరుకమ్మనగా తమకు మృత్యువు అనేది లేనట్లు వరమిమ్మని కోరుకుంటారు. అది సాధ్యం కాదని చెప్పగా అయితే మాకు మూడు నగరాలు కావాలి. వెయ్యేండ్ల కొకసారి మేము ఒక చోట కలుస్తాము. అప్పుడు ఆ మూడు నగరాలు కుడా ఒకే చోట కలవాలి. ఆ విధంగా మేము ముగ్గురం ఒకే బాణంతో చనిపోవాలి అని వరం కోరుకుంటారు. బ్రహ్మవారు అడిగిన విధంగానే వరమిచ్చి అంతర్దానమవుతాడు. తర్వాత వీరు మయుడ్ని పిలిచి ఒకటి బంగారంతో. రెండోది వెండితో, మూడోది ఇనుముతో మూడు నగరాలు నగరాలు నిర్మించమని కోరుతారు. మయుడు వారు కోరిన విధంగా మూడు నగరాలు నిర్మించి ఇచ్చాడు. ఒకటి స్వర్గంలో, ఒకటి ఆకాశంలో, మరొకటి భూమి మీద ఉంటాయి. హిరణ్య కశిపుని సంతతి వాడైన బాణుడు ఈ నగరాల పర్యవేక్షణ చూసేవాడు. ఈ మూడు నగరాలను కలిపి త్రిపుర అంటారు. దానవులు ఎక్కువగా చనిపోవడం వారి సంఖ్య తగ్గడం వారిని కలచివేసింది. తారకాసురుని కుమారుల్లో ఒకడైన హరి విష్ణువు గూర్చి తపస్సు చేయగా అతడు ప్రత్యక్షమయ్యాడు. అతని కోరిక ప్రకారం మయుడు ఒక తొట్టెను నిర్మించి అందులో అమృతం నింపుతాడు. చనిపోయిన దానవులని అందులో ముంచితే సజీవులు అవుతుంటారు. దానితో శక్తివంతులైన దానవుల ధాటికి దేవతలు భయకంపితులై బ్రహ్మను సలహా అడుగగా తమకు సాధ్యం కాదని వారిని పరమేశ్వరుని వద్దకు తీసుకువెళతాడు. పరమేశ్వరుడు బ్రహ్మాది దేవతలకు అభయమిచ్చి వారి సంహారానికి ప్రయత్నాలు ప్రారంభించి తపతీనది తీరమే సరైన స్థలంగా భావించి, నారదుడి ద్వారా అసురుల భార్యలకు దేవతల మంచితనాన్ని చాటి వారిని దేవతల వైపుకు మరల్చాడు. దేవతల శక్తిలో సగభాగాన్ని తీసుకుని దాన్ని తన త్రిశూలంలో కలుపుకున్నాడు. అక్కడ శివుడు వీరి కలయిక కోసం వెయ్యేళ్ళు గడిపాడు. మందర పర్వతాన్ని తన విల్లుగా వాసుకిని వింటి తాడుగా శ్రీ మహావిష్ణువుని తన అస్త్రంగా చేసుకున్నాడు. అగ్నిని బాణం కొనగా వాయువును బాణం మూలుగా మలుచుకున్నాడు. భూమి రథం కాగా, సూర్యచంద్రులు రథ చక్రాలు అయ్యారు. బ్రహ్మ రథసారధి అయ్యాడు. ఆవిధంగా అంతా సిద్దం కాగా. ఎప్పుడైతే త్రిపురాసులు కలుసుకున్నారో అప్పుడు శివుడు తన త్రిశూలాన్ని విసరగా ఆ మూడు నగరాలు విడిపోయాయి. అప్పుడు శివుడు బాణాన్ని సంధించగా శ్రీ మహావిష్ణువు ఒకేసారి త్రిపురాసురుల్ని వరుసగా వధించగా వారితో పాటు ఆ నగరాల్లోని అసురులందరూ కుడా భస్మమయ్యారు.





Untitled Document
Advertisements