గంభీర్‌కు సుప్రీంకోర్టులో షాక్!

     Written by : smtv Desk | Mon, Jul 26, 2021, 02:43 PM

గంభీర్‌కు సుప్రీంకోర్టులో షాక్!

కరోనా రెండో దశ వ్యాప్తి సమయంలో మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ భారీ మొత్తంలో ఫాబీ ఫ్లూ ఔషధాలను కొనుగోలు చేసి సరఫరా చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు ఇది వరకే తప్పుబట్టిన విషయం తెలిసిందే. మార్కెట్‌లో తీవ్ర కొరత ఉన్న ఒక ఔషధాన్ని అంత భారీ సంఖ్యలో గంభీర్‌ ఎలా కొనుగోలు చేశారో విచారణ జరపాలని ఢిల్లీ ఔషధ నియంత్రణ అధికారిని ఆదేశించింది. ఈ ఆదేశాలను నిలుదల చేయాలని కోరుతూ గంభీర్ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయగా.. సోమవారం దీనిపై విచారణ చేపట్టింది. గంభీర్‌పై విచారణను నిలుపుదల చేయలేమని పేర్కొంది. ఇంకా ఎటువంటి ఉత్తర్వులు జారీచేయనందున తిరిగి ఢిల్లీ హైకోర్టునే సంప్రదించాలని సూచించింది. ‘మేము దీనిని ఆపలేం... పరిహారం కోసం హైకోర్టునే ఆశ్రయించండి.. ఔషధాల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో ట్రస్ట్ లేదా వ్యక్తులు వాటి పంపిణీకి అనుమతించలేం.. వ్యక్తిగతంగా ఎవరూ ఔషధాలను పంపిణీ చేయలేరు.. అదే జరిగితే ప్రతి ఒక్కరూ తమ స్వప్రయోజనం కోసం సేకరించి పంపిణీ చేస్తారు’ అని వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో గంభీర్ తరఫున లాయర్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. దేశంలో కరోనా రెండో దశ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్నప్పుడు గంభీర్ ఔషధాలు కొనుగోలు చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు మండిపడింది. సమాజానికి గంభీర్‌ అపకారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. భారీ మొత్తంలో ఔషధాలను కొనుగోలు చేసి, వాటిని నిల్వ చేసి, ఇతరులకు ఉచితంగా పంచడాన్ని న్యాయస్థానం తప్పు పట్టింది. గంభీర్‌ ఉద్దేశం మంచిదే అయినా దాని వల్ల సమాజానికి నష్టం కలుగుతోందని, మార్కెట్‌లో ఔషధాల కొరత ఏర్పడుతోందని పేర్కొంది. సామాన్యులు ఇబ్బందులు పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. 2,345 స్ట్రిప్పుల ఫాబీ ఫ్లూ మాత్రలను గంభీర్‌ కొనుగోలు చేయడంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బయట మార్కెట్‌లో తీవ్ర కొరత ఉన్న ఒక ఔషధాన్ని అంత భారీ సంఖ్యలో గంభీర్‌ ఎలా కొనుగోలు చేశారో విచారణ జరపాలని ఢిల్లీ ఔషధ నియంత్రణ అధికారిని ఆదేశించింది.





Untitled Document
Advertisements