800 ఏళ్ల నాటి ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు వెనుక ఆసక్తికర పరిణామాలు

     Written by : smtv Desk | Mon, Jul 26, 2021, 04:13 PM

800 ఏళ్ల నాటి ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు వెనుక ఆసక్తికర పరిణామాలు

తెలంగాణలోని చారిత్రక రామప్ప గుడికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపునివ్వడం తెలిసిందే. కాకతీయ శిల్ప కళా వైభవానికి ప్రతీకలా నిలిచే ఈ 800 ఏళ్ల నాటి ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కడం వెనుక ఆసక్తికర పరిణామాలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం దౌత్య మార్గాల ద్వారా గట్టి పట్టుబట్టడంతో యునెస్కో రామప్ప గుడిని వరల్డ్ హెరిజేట్ సైట్ గా ప్రకటించింది.

కాగా, రామప్ప గుడికి గుర్తింపుపై నార్వే తీవ్రంగా వ్యతిరేకించింది. భారత్ పంపిన ప్రతిపాదనల పట్ల నార్వే అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ భారత్ కు చిరకాల మిత్రదేశం రష్యా మాత్రం రామప్ప గుడికి గుర్తింపు ఇవ్వాలంటూ చివరి వరకు మద్దతుగా నిలిచింది.

2019లో రామప్ప గుడి అంశం యునెస్కో వద్దకు చేరింది. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ (ఐసీఎంఓఎస్) సభ్యులు ములుగు జిల్లాలోని పాలంపేటలో కొలువై ఉన్న 13వ శతాబ్దం నాటి రామప్ప ఆలయాన్ని సందర్శించారు. అందులోని 9 అంశాలు లోపభూయిష్టంగా ఉన్నాయంటూ, వారసత్వ కట్టడంగా గుర్తింపునిచ్చేందుకు నిరాకరించారు. అప్పటినుంచి కేంద్ర ప్రభుత్వం తన ప్రయత్నాలను మరింత తీవ్రతరం చేసింది.

రామప్ప గుడి ప్రాశస్త్యాన్ని, నిర్మాణ శైలి, కాకతీయ రాజుల వైభవాన్ని, నాటి పరిస్థితులను యునెస్కోకు వివరించడంలో సఫలమైంది. తద్వారా ఓటింగ్ వరకు ఈ అంశాన్ని తీసుకెళ్లగలిగింది. అయితే, ఐసీఎంఓఎస్ సభ్యులు రామప్ప గుడి వద్ద గుర్తించిన లోపాలను ఆధారంగా చేసుకుని నార్వే వ్యతిరేక ఓటు వేయగా, రష్యా తదితర దేశాల బాసటతో భారత్ ప్రతిపాదనలకు విజయం చేకూరింది.





Untitled Document
Advertisements