శ్రీరాముని పాదుకా పట్టాభిషేకం !

     Written by : smtv Desk | Tue, Jul 27, 2021, 02:33 PM

శ్రీరాముని పాదుకా పట్టాభిషేకం !

కైకేయి కోరిక మేరకు సీతా లక్ష్మణ సమేతంగా అడవులకు పయనమైన రామునితో భరతుడు "అన్నా! మా అమ్మ రాజ్యకాంక్షతో విజ్ఞత మరచి నిన్ను అడవులకు పంపమని కోరి ఎంతో ఘోరమైన తప్పు చేసింది. నాకు రాజ్యం పై కోరిక లేనే లేదు. రాజ్యాధికారం జ్యేష్టుడీకే గాని నాకు అర్హత లేదు. ఈ రాజ్యం నీది. నీవు అయోధ్యకు వచ్చి రాజ్యాధికారం స్వీకరించు అన్నాడు". "సోదరా! భరతా! నీ ఆదర్శం అభినందనీయం. తండ్రి గారికిచ్చిన మాటలు నేరవేర్చకపోవడం రఘువంశానికి మాయని మచ్చ అవుతుంది. ఆయన కోరిక నెరవేర్చడం ద్వారా వారి ఆత్మకు శాంతిని కలుగజేయడం పుత్రులుగా మనం నిర్వహించాల్సిన కర్తవ్యం. మన వంశ గౌరవాన్ని పెంచాలే గాని కళంకం తీసుకు రాకూడదు. కైకేయి మాతకు నేనిచ్చిన మాట నిలుపుకోవాలి. ఆమె కోరిక ప్రకారం నీవు రాజ్యపాలన చేయక తప్పదు" అన్నాడు రాముడు. భరతుడు ఎంత చెప్పిన వినకుండా "పితృవాక్యపాలనే తనకు ముఖ్యమని, వనవాస దీక్ష పూర్తి అయిన తరువాతనే అయోధ్యలో అడుగు పెడతా" నని తెలిపాడు.
అయిష్టంగానే భరతుడు రామజ్ఞను శిరసావహిస్తానన్నాడు. కాని ఒక షరతు పెట్టాడు. "అన్నా! నీ పాదుకలను ఇస్తే వాటికి పట్టాభిషేకం చేసి నీ తరపున నేను రాజ్యభారం వహిస్తాను. గడువు పూర్తికాగానే నీవు అయోధ్యకు తిరిగి రావాలి. లేకుంటే నేను ఆత్మాహుతి చేసుకుంటాను" అన్నాడు. వశిష్టుని ఆదేశంతో రాముడు తన పాదుకలను భరతునికి ఇచ్చాడు. రామ పాదుకలను తలపై పెట్టుకొని భరతుడు తన పరివారంతో తిరిగి అయోధ్యకు చేరుకున్నాడు. రాముని పాదుకలను రాజ సింహాసనంపై ఉంచి, నదీ జలాలతో అభిషేకించి ఆ పాదుకలకు పట్టాభిషేకం జరిపించి శ్రీరాముని తరుపున రాజ్య పాలన చేశాడు భరతుడు.

Untitled Document
Advertisements