కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 వేలు ఎక్స్‌గ్రేషియా

     Written by : smtv Desk | Thu, Sep 23, 2021, 11:16 AM

కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 వేలు ఎక్స్‌గ్రేషియా

కరోనా కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 వేలు ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలంటూ గౌరవ్ కుమార్ బన్సాల్, రీపక్ కన్సాల్ అనే ఇద్దరు లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ విషయంలో మార్గదర్శకాలు విడుదల చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మార్గదర్శకాల విడుదలకు ప్రధాన మంత్రి ఆధ్వర్యంలోని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎమ్ఏ)కు 6 వారాల గడువిస్తున్నట్లు జూన్ 30న ప్రకటించింది. ఆగస్టు 16న మరో రెండు వారాల గడువిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే మార్గదర్శకాలను వివరిస్తూ ఎన్‌డీఎమ్‌ఏ అఫిడవిట్ దాఖలు చేసింది

కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 వేలు అందించాలని తాము నిర్ణయించినట్లు ఈ అఫిడవిట్‌లో ప్రభుత్వం పేర్కొంది. బాధితులు మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కరోనాతో మరణించినట్లు ధ్రువీకరణ తీసుకోవాలని సూచించింది. వీటిని జిల్లా విపత్తు నిర్వహణ సంస్థల్లో అందిస్తే ఎక్స్‌గ్రేషియా నిధులు వారి కుటుంబాలకు చేరతాయని కేంద్రం వివరించింది.

ఈ నిధులను ఆయా రాష్ట్రాల విపత్తు నిర్వహణా నిధుల నుంచి అందించనున్నట్లు పేర్కొంది. ఈ పరిహారం అందించే ప్రక్రియ మొత్తం జిల్లా విపత్తు నిర్వహణ సంస్థల ఆధ్వర్యంలోనే జరుగుతుందని తెలిపింది. ఈ ప్రక్రియ చాలా సులభతరంగా ఉంటుందని వివరించింది. అలాగే ఇప్పటికే కొందరు కరోనా పేషెంట్లకు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు కొంత సహాయం అందించిన విషయాన్ని కూడా ప్రభుత్వం తన అఫిడవిట్‌లో పేర్కొంది.





Untitled Document
Advertisements