MI బౌలర్లకు చుక్కలు చూపించిన KKR

     Written by : smtv Desk | Fri, Sep 24, 2021, 11:14 AM

MI బౌలర్లకు చుక్కలు చూపించిన KKR

ఐపీఎల్ 2021 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌కి ఘోర పరాభవం ఎదురైంది. అబుదాబి వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 7 వికెట్ల తేడాతో ముంబయిపై సంచలన విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్‌లో తొలుత డికాక్ (55: 42 బంతుల్లో 4x4, 3x6) హాఫ్ సెంచరీ బాదడంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. కానీ.. కోల్‌కతా జట్టులో రాహుల్ త్రిపాఠి (74 నాటౌట్: 42 బంతుల్లో 8x4, 3x6), వెంకటేశ్ అయ్యర్ (53: 30 బంతుల్లో 4x4, 3x6) మెరుపు హాఫ్ సెంచరీలు బాదడంతో.. ఆ జట్టు 15.1 ఓవర్లలోనే 159/3తో విజయాన్ని అందుకుంది. 2019, ఏప్రిల్‌లో ముంబయి ఇండియన్స్‌ని చివరిగా కోల్‌కతా జట్టు ఓడించింది. ఆ తర్వాత ఈరోజు వరకూ ఆ జట్టు చేతిలో కోల్‌కతా ఓడిపోతూ వచ్చింది. 156 పరుగుల లక్ష్యఛేదనని కోల్‌కతా ఓపెనర్లు దూకుడుగా ఆరంభించారు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో శుభమన్ గిల్ (13: 9 బంతుల్లో 1x4, 1x6), వెంకటేశ్ అయ్యర్ చెరో సిక్స్ బాదేశారు. ఆ తర్వాత వచ్చిన బుమ్రా, ఆడమ్ మిల్నేకీ . బౌండరీల బాధ తప్పలేదు. టీమ్ స్కోరు 40 వద్ద గిల్‌ని బుమ్రా ఔట్ చేసినా.. అనంతరం వచ్చిన రాహుల్ త్రిపాఠి భారీ షాట్లతో చెలరేగిపోయాడు. మరీ ముఖ్యంగా.. స్పిన్నర్లని లక్ష్యంగా చేసుకుని అతను బౌండరీల మోత మోగించాడు. దాంతో.. 9-10 ఓవర్లు ముగిసే సమయానికే ముంబయి బౌలర్లు చేతులెత్తేసింది. కెరీర్‌లో రెండో ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న అయ్యర్ కూడా భారీ షాట్లు ఆడేసి.. హాఫ్ సెంచరీని నమోదు చేయగా.. అతనితో పాటు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (7)ని బుమ్రా వరుస ఓవర్లలో ఔట్ చేశాడు. కానీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మ్యాచ్‌లో అంతకముందు టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో.. డికాక్‌తో కలిసి ముంబయి ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ శర్మ (33: 30 బంతుల్లో 4x4) ఆరంభంలో దూకుడుగా ఆడాడు. కానీ.. డికాక్ టాప్ గేర్‌లోకి వెళ్లిన తర్వాత అతనికి సపోర్ట్ చేస్తూ కనిపించిన రోహిత్ శర్మ.. ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో ఔటయ్యాడు. మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్‌లో సిక్స్ కోసం హిట్‌మ్యాన్ ప్రయత్నించగా.. బౌండరీ లైన్ వద్ద శుభమన్ గిల్ చేతికి అతను చిక్కాడు. అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (5), ఇషాన్ కిషన్ (14) తేలిపోగా.. కీరన్ పొలార్డ్ (21: 15 బంతుల్లో 2x4, 1x6), కృనాల్ పాండ్య (12: 9 బంతుల్లో 1x6) ఆఖరి ఓవర్‌లో వరుసగా ఔటయ్యారు. దాంతో.. ముంబయి 155 పరుగులకే పరిమితమైంది. కోల్‌కతా బౌలర్లలో ప్రసీద్, పెర్గూసన్ చెరో వికెట్లు పడగొట్టగా.. సునీల్ నరైన్ ఒక వికెట్ తీశాడు.






Untitled Document
Advertisements