చిన్నారులపై డెల్టా వేరియంట్ ప్రభావమెంత!?

     Written by : smtv Desk | Fri, Sep 24, 2021, 12:13 PM

చిన్నారులపై డెల్టా వేరియంట్ ప్రభావమెంత!?

ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని డెల్టా వేరియంట్ వేధిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలోని అధిక దేశాల్లో డెల్టా ప్రాబల్యమే ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా ప్రకటించింది. ఈ క్రమంలో చిన్నారులపై డెల్టా వేరియంట్ ప్రభావం ఏ విధంగా ఉంటుందనే అంశంపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. కొందరేమో చిన్నపిల్లలపై ఈ వేరియంట్ తీవ్రమైన ప్రభావం చూపుతుందని అంటున్నారంటూ వార్తలు వచ్చాయి.

అయితే ఈ వాదనలకు బలం చేకూర్చే ఆధారాలు లేవని అమెరికా సైంటిస్టులు చెబుతున్నారు. డెల్టా వేరియంట్ ప్రాబల్యం అత్యధికంగా ఉన్న దేశాల్లో అమెరికా ఒకటన్న విషయం తెలిసిందే. ఇక్కడ డెల్టా బారిన పడుతున్న చిన్నారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొంతకాలంగా ఈ దేశంలో వారానికి 2 లక్షలమందికిపైగా చిన్నారులు కరోనా పాజిటివ్‌గా తేలుతున్నారు. ఈ విషయాన్ని అమెరికా అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్స్ అసోసియేషన్ వెల్లడించింది.

ఇప్పటి వరకూ అమెరికాలో 50 లక్షల మంది చిన్నారులు కరోనా బారిన పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే వీరిలో ప్రతి 2 లక్షల మందిలో 2 శాతం మంది మాత్రమే ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొన్నట్లు అమెరికా సీడీసీ తెలిపింది. ఇలా ఆసుపత్రిలో చేరిన వారిలో ఎక్కువ శాతం మంది డెల్టా సోకిన వారే అయినప్పటికీ ఈ వైరస్ తీవ్రత మాత్రం తక్కువగానే ఉన్నట్లు సీడీసీ వెల్లడించింది.

అలాగే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు డెల్టా వేరియంట్‌పై ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని పేర్కొంది. 12 ఏళ్లు పైబడిన పిల్లల్లో కూడా వ్యాక్సిన్ తీసుకున్న వారితో పోలిస్తే, తీసుకోని వారు ఆసుపత్రిలో చేరే ప్రమాదం 10 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు సీడీసీ వివరించింది.





Untitled Document
Advertisements